Site icon NTV Telugu

SKLM MARPHING: మార్ఫింగ్ మాయ..

Bealert

Bealert

SKLM MARPHING: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌ను అక్రమాలకు కొంత మంది ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. తాజాగా శ్రీకాకుళం‌లో ఏఐ టూల్స్ ఉపయోగించి విద్యార్థినుల ఫోటోలను మార్ఫింగ్ చేశారు కొంత మంది విద్యార్థులు. దీంతో గురజాడ గాయత్రి కళాశాలలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ కాలేజీలో ఏం జరిగింది? విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఏమంటున్నారు? నిందితులను పోలీసులు పట్టుకున్నారా? కాలేజీ యాజమాన్యం వెర్షన్ ఏంటి?. AI సాంకేతిక పరిజ్ఞానం.. రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఉన్నది లేనట్లు..లేనిది ఉన్నట్లుగా ఫోటోలు.. వీడియోలు క్రియేట్ చేయడంలో సాంకేతిక పరిజ్ఞానం బాగా ఉపయోగపడుతోంది. కానీ దానిని కొంత మంది ఆకతాయిలు మిస్ యూజ్ చేస్తున్నారు. అశ్లీలాలకు, జుగుప్స కలిగించే వీడియోలకు వాటిని వాడుతున్నారు. శ్రీకాకుళంలోని మునసబుపేటలో ఉన్న గురజాడ గాయిత్రి కళాశాలలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. ఆ కాలేజీలో చాలా మంది విద్యార్థినుల ఫోటోలను మార్ఫింగ్ చేసిన అంశం కలకలం సృష్టించింది.

ఈ మధ్య కాలేజీలో ఓ కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంగా చాలా మంది విద్యార్థినీ విద్యార్థులు ఫోటోలు దిగారు. ఇది సర్వసాధారణంగా ఎక్కడైనా జరిగేదే. కానీ ఇక్కడే కొంత మంది విద్యార్థులు.. తమ కన్నింగ్ బ్రెయిన్ వాడారు. పలువురు విద్యార్థినుల ఫోటోలను ఏఐ టూల్స్ సాయంతో మార్ఫింగ్ చేశారు. అంతే కాదు ఓ విద్యార్థినికి ఆ ఫోటోలు చూపించి బెదిరించారు. డబ్బులు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేశారు. దీంతో ఒక్కసారిగా షాకయిన విద్యార్థిని.. ధైర్యంగా విషయాన్ని తల్లిదండ్రులతో పంచుకుంది. తల్లిదండ్రులు ప్రశ్నించడంతో విషయం బయటకు వచ్చింది. కానీ కాలేజీ యాజమాన్యం మాత్రం పరువు కోసం ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించింది. గుట్టుచప్పుడు కాకుండా ఆయా విద్యార్థులుకు టీసీ ఇచ్చి చేతులు దులిపేసుకుంది.

అంతకు ముందు కాలేజీ యాజమాన్యం అంతర్గత విచారణ చేపట్టి.. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ మొదటి ఏడాది చదవుతున్న సాయి, మధు, బాలు, హర్షవర్థన్‌తో పాటు బీఎస్సీ సీనియర్ విద్యార్థినిని కూడా బాధ్యులుగా గుర్తించారు. వీరి నుంచి 5 జీబీ డేటాను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. వీరిలో నలుగురు జూనియర్లకు రెండు రోజుల క్రితం టీసీలు ఇచ్చి కాలేజీ నుంచి పంపించేశారు. విద్యార్ధినులందరూ కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చి నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చివరకు విద్యార్థినుల ఫొటోల మార్ఫింగ్‌లో సంబంధం ఉన్న విద్యార్థులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని యాజమాన్యం.. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వివిధ కోణాల్లో ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version