షిల్లాంగ్ నుంచి హైదరాబాద్ నగరానికి అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠా గుట్టును ఈగల్ ఫోర్స్, మెడ్చల్ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో రట్టు చేశారు. మెడ్చల్‌లోని పద్మావతి హోమ్స్‌లో ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి సుమారు రూ. 4.5 లక్షల విలువైన 9 కిలోల గంజాయితో పాటు 3 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు మణీష్ కుమార్ ఝా సహా ముగ్గురిని అరెస్టు చేశారు.
విమానంలో వెళ్లి.. రైలులో గంజాయి తరలింపు
నిందితులు షిల్లాంగ్‌లో కిలో గంజాయిని రూ. 37 వేల చొప్పున కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. అక్కడికి విమానంలో వెళ్లి, తిరుగు ప్రయాణంలో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో రెండు బ్యాగుల్లో గంజాయిని హైదరాబాద్‌కు తరలించినట్లు పోలీసులు గుర్తించారు.
వాట్సాప్ ద్వారా సాచెట్ల విక్రయం
హైదరాబాద్‌కు తీసుకొచ్చిన గంజాయిని చిన్న చిన్న సాచెట్లుగా ప్యాక్ చేసి, వాట్సాప్ ద్వారా కస్టమర్లకు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ఒక్కో సాచెట్‌లో సుమారు 10 గ్రాముల గంజాయిని ప్యాక్ చేసి, రూ. 500 నుంచి రూ. 700 వరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు ఈ ముఠా నుంచి గంజాయి కొనుగోలు చేసిన 9 మంది వినియోగదారులను పోలీసులు గుర్తించారు.
పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు.. లోతైన దర్యాప్తు
ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు షాబిబ్, శ్రీకాంత్ పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు, అరెస్టైన నిందితుల బ్యాంకు లావాదేవీలు, వాట్సాప్ చాటింగ్‌లు, మొబైల్ డేటా ఆధారంగా ఈ నెట్‌వర్క్ మూలాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

