Shabad Murders Case: షాబాద్‌ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్‌కుమార్‌ మృతదేహం లభ్యం..

Shabad Murders Case

Shabad Murders Case

Shabad Murders Case: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురి హత్య కేసు సంచలనం సృష్టించింది.. భార్య, ఇద్దరు పిల్లలు, ఓ మైనర్‌ బాలిక.. ఆ బాలిక అమ్మమ్మ, నాన్నమ్మను అత్యంత దారుణంగా నరికిచంపిన కేసులో నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్‌ మృతిచెందాడు. అయితే, రాజ్‌కుమార్‌ మృతదేహం లభ్యమైంది.. కొత్తూరు మండలం పంజర్లలోని శతాబ్ది వెంచర్స్‌ ప్రాంతంలో అతని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు.. ఘటనాస్థలిలో మృతదేహం పక్కన విషం సీసా లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, రాజ్‌కుమార్‌ తన మేనమామ గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. అయితే, మృతికి గల ఖచ్చితమైన కారణాలు, పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. షాబాద్‌ సామూహిక హత్యలతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో తాజా పరిణామం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే, రాజ్‌కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడా? ఇంకా ఏమైనా జరిగిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు..

కాగా, సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్‌కు సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జూన్ 12న పోక్సో కేసులో కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అతడు కోర్టులో చేసిన వాదనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. బెయిల్ విచారణ సందర్భంగా.. తనపై నమోదైన పోక్సో కేసు తప్పుడు కేసు అని రాజ్‌కుమార్ కోర్టుకు తెలిపినట్లు సమాచారం. బాధిత బాలిక తండ్రి తన వద్ద అప్పు చేశాడని, ఆ డబ్బులు తిరిగి అడిగినందుకే తనపై కేసు పెట్టారని వాదించాడు. ఫిర్యాదు చేసిన రోజు తాను అక్కడే లేనని, ఆ సమయంలో భార్యతో కలిసి ఆస్పత్రికి వెళ్లినట్లు కోర్టులో తెలిపాడు.

దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. మైనర్ బాలికకు సంబంధించిన కేసు నమోదైన తర్వాత రాజ్‌కుమార్ కుటుంబంలో విభేదాలు మరింత పెరిగాయి. ఈ వ్యవహారం తర్వాత అతడి భార్య సరిత విడాకులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఇదే విషయంపై రాజ్‌కుమార్ తీవ్ర ఆగ్రహానికి గురై, పలుమార్లు సరితను చంపేస్తానని బెదిరించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తు ప్రకారం.. హత్యలకు ముందు రాజ్‌కుమార్ సాధారణంగానే వ్యవహరించినట్లు గుర్తించారు. ఘటనకు కొన్ని గంటల ముందు తన కుమారుడితో కలిసి బయటకు వెళ్లి ఆడించడంతో పాటు హెయిర్ కటింగ్ కూడా చేయించినట్లు సమాచారం. అదే రోజు ఉత్సాహంగా ఇంటికి వెళ్లిన తర్వాత కుటుంబ సభ్యులపై దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.