Site icon NTV Telugu

Online Betting : ఆన్‌లైన్ బెట్టింగ్ కు కానిస్టేబుల్ బలి

Suicide

Suicide

Online Betting : ఆన్‌లైన్ బెట్టింగ్‌, గేమింగ్ యాప్‌ల బారి ఎంత ఘోరంగా ఉందో మరోసారి తెలంగాణలో చోటుచేసుకున్న ఘటన నిరూపించింది. కష్టపడి సంపాదించిన డబ్బు.. చివరికి ఈ వర్చువల్ ప్రపంచపు వలలో చిక్కుకుని ప్రాణాన్నే త్యాగం చేసిన యువకుడు. ఈసారి ఆ బాధితుడు సాధారణ వ్యక్తి కాదు.. ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్‌ వ్యవస్థలో పనిచేసే కానిస్టేబుల్‌నే.

సంగారెడ్డి జిల్లా కల్హేరు మండల కేంద్రానికి చెందిన సందీప్ (24) గత సంవత్సరం జరిగిన పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికై 2024 బ్యాచ్‌ కానిస్టేబుల్‌గా చేరాడు. ప్రస్తుతం సంగారెడ్డి టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. చిన్న వయసులోనే ప్రభుత్వ ఉద్యోగం రావడంతో కుటుంబం గర్వంగా, సంతోషంగా గడుపుతోంది. తల్లి, చెల్లి మాత్రమే ఉన్న ఈ కుటుంబానికి సందీప్ ఆదారంగా నిలిచాడు.

అయితే ఈ సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు. గత కొంత కాలంగా సందీప్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, లోన్‌ యాప్‌లకు బానిసైనట్లు తెలిసింది. కొద్దికొద్దిగా డబ్బు కోల్పోయి.. చివరికి భారీ అప్పుల్లో కూరుకుపోయాడు. తోటి సహచరులు చెబుతున్నట్లుగా.. గత రెండు రోజులుగా ఆయన ముభావంగా ఉండేవాడు, ఏదో తెలియని భయంతో, ఆందోళనతో కనిపించేవాడట.

ఆ ఆందోళనే చివరికి ప్రాణం తీసుకుంది. సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పోలీస్ స్టేషన్‌లోని ఆమ్స్ బెల్‌ నుంచి పిస్టల్‌ తీసుకుని సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ వద్దకు వెళ్లాడు. అక్కడే తుపాకీతో తన ఛాతీపై కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ అంతటా విషాదఛాయలు కమ్ముకున్నాయి.

సంగారెడ్డి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రాథమికంగా బెట్టింగ్‌ వ్యసనమే కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. మృతుని తల్లి, చెల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తూ, “ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని గర్వపడుతున్నాం, కానీ ఇలా ప్రాణం తీసుకుంటాడని ఊహించలేదు” అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో అనేకమంది యువకులు ఆన్‌లైన్ బెట్టింగ్‌ల బారిన పడి ఆర్థికంగా, మానసికంగా నాశనం అవుతున్నారు. నేరుగా ప్రాణాలు కోల్పోయిన ఘటనల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పోలీసులు, సైబర్ క్రైమ్ అధికారులు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా కూడా పరిస్థితి మారడం లేదు.

సంగారెడ్డి కానిస్టేబుల్‌ సందీప్‌ మరణం మరోసారి సమాజానికి హెచ్చరిక గంట మోగించింది. ఈ ప్రమాదకరమైన ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ వలయం ఎంత ప్రాణాంతకమో మళ్లీ మన ముందుకు తెచ్చింది.

Exit mobile version