Hyderabad: రాష్ట్రంలో కలకలం రేపిన భారీ నకిలీ కరెన్సీ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ఏకంగా రూ. 6.78 కోట్ల విలువైన నకిలీ ₹500 నోట్లను ముద్రిస్తూ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు, షాద్‌నగర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) సంయుక్తంగా రట్టు చేశాయి. ఈ ఆపరేషన్‌లో నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వాహన తనిఖీల్లో దొరికిన నిందితులు అబ్దుల్లాపూర్‌మెట్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిర్వహించిన ముమ్మర వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఓ డిజైర్ కారును ఆపి తనిఖీ చేశారు. కారులో ఉన్నవారి ప్రవర్తనపై అనుమానం వచ్చి లోతుగా సోదాలు నిర్వహించగా, భారీ ఎత్తున కట్టలు కట్టలుగా ఉన్న నకిలీ ₹500 నోట్లు బయటపడ్డాయి. దీంతో కారులో ఉన్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టయిన వారిలో మడుపోజు కర్ణాకర్ (A1), చిన్నోళ్ల మాణిక్య రెడ్డి (A2), చెరుకుపెల్లి రత్నాకర్ రెడ్డి (A3), కరణం అజయ్ కుమార్ (A4) ఉన్నారు. ఈ ముఠాలో కీలక పాత్ర పోషించిన జల్లి వెంకటేష్, కుంజా బలరాజు, కంపసటి శ్రీనివాస్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని అధికారులు తెలిపారు.
యూట్యూబ్‌లో చూసి ప్రింటింగ్.. అద్దె ఇంట్లో దందా
పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితులు చెప్పిన వివరాలు విస్మయానికి గురిచేశాయి. కుంట్లూర్ ప్రాంతంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్న ఈ ముఠా, యూట్యూబ్, సోషల్ మీడియా వీడియోలను చూసి ఫొటోషాప్ ద్వారా నకిలీ ₹500 నోట్లను తయారు చేయడం ప్రారంభించింది. అసలు నోట్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రింట్ చేసేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించారు. నిందితుల నుంచి సమాచారం సేకరించిన పోలీసులు.. ఘటనా స్థలంతో పాటు కుంట్లూర్‌లోని అద్దె ఇంటిపై దాడి చేసి ప్రింటింగ్ మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న వస్తువులు:
* రూ. 6,78,00,000 ముఖ విలువ కలిగిన నకిలీ ₹500 నోట్లు
* అత్యాధునిక కలర్ ప్రింటర్లు, స్కానర్లు
* పేపర్ కటింగ్ మెషిన్లు, ల్యామినేషన్ మెషిన్
* ల్యాప్‌టాప్, ఫేక్ నంబర్ ప్లేట్లు
* స్విఫ్ట్ డిజైర్ కారు
పోలీసుల పేరుతో బెదిరింపులు, మోసాలు
ఈ ముఠా కేవలం నకిలీ నోట్లను ముద్రించడమే కాకుండా, మరో వికృత నేరానికి కూడా తెరలేపింది. నకిలీ ఐడీ కార్డులు, డమ్మీ పిస్టల్స్, వాకీటాకీలను ఉపయోగించి తాము పోలీసులమని అమాయకులను బెదిరించే వారని విచారణలో తేలింది. భారీగా నగదు ఉన్న వ్యాపారులు, వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ వారి వద్ద ఉన్న అసలు డబ్బులను దోచుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. సకాలంలో స్పందించి ఇంతటి భారీ రాకెట్‌ను పట్టుకున్న అబ్దుల్లాపూర్‌మెట్ మరియు షాద్‌నగర్ SOT బృందాలను ఉన్నతాధికారులు అభినందించారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

