శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న భారీ విదేశీ కరెన్సీని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు పట్టుకున్నారు. కౌలాలంపూర్ వెళ్లేందుకు సిద్ధమైన ఇద్దరు ప్రయాణికుల నుంచి సుమారు రూ.1.56 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకుని, వారిని అరెస్ట్ చేశారు.
విదేశీ కరెన్సీని అక్రమంగా రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో డీఆర్ఐ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో నిఘా ముమ్మరం చేశారు. గురువారం రాత్రి ఎయిర్ ఆసియా విమానం (AK-68) ద్వారా మలేషియా రాజధాని కౌలాలంపూర్‌కు వెళ్లేందుకు వచ్చిన ఒక భారతీయ ప్రయాణికుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి క్యాబిన్ లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, ట్రాలీ బ్యాగ్‌లోని దుస్తుల మధ్య దాచిన నల్లటి ప్లాస్టిక్ కవర్లో 66,600 అమెరికన్ డాలర్లు, 3,773 మలేషియన్ రింగిట్లు, 2 సింగపూర్ డాలర్లను గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.63.62 లక్షలు ఉంటుందని లెక్కించారు.
అదుపులోకి తీసుకున్న వ్యక్తిని విచారించగా, మరొక మహిళా ప్రయాణికురాలు కూడా అదే విమానంలో వేరే పీఎన్ఆర్ (PNR) నంబర్‌తో ప్రయాణిస్తున్నట్లు వెల్లడించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు విమానాశ్రయంలో గాలింపు చేపట్టి, ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె క్యాబిన్ బ్యాగేజీని పరిశీలించగా, అదే తరహాలో నల్లటి ప్లాస్టిక్ కవర్లో దాచిన 97,600 అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు.
సదరు కరెన్సీకి సంబంధించిన ఎలాంటి చట్టబద్ధమైన పత్రాలు చూపించకపోవడంతో, మొత్తం రూ.1.56 కోట్ల విలువైన విదేశీ కరెన్సీతో పాటు లగేజీ బ్యాగులను కస్టమ్స్ చట్టం-1962 కింద సీజ్ చేశారు. అనంతరం ఆ ఇద్దరు ప్రయాణికులను అరెస్ట్ చేసి, ఈ కరెన్సీ స్మగ్లింగ్ వెనుక ఏదైనా హవాలా ముఠా ఉందా అనే కోణంలో డీఆర్ఐ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు.

