NTV Telugu Site icon

Kolkata Doctor case: వెలుగులోకి సందీప్ ఘోష్ క్రూరత్వం.. బాలింత భార్యను కడుపుపై తన్నిన మాజీ ప్రిన్సిపాల్

Kolkatadoctorcase

Kolkatadoctorcase

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. అత్యంత క్రూరంగా వైద్యురాలు హత్యాచారానికి గురైంది. పోస్టుమార్టం రిపోర్టు కళ్లు బైర్లు కమ్మేలా ఉంది. అంత హింసాత్మకంగా వైద్యురాలిపై దాడి జరిగింది. ఇక ఘటనాస్థలిలో బాధితురాలు అర్ధనగ్నంగా పడి ఉండడం.. దేహమంతా గాయాలై.. రక్తసిక్తంగా శవమై పడి ఉంది. ఇంత ఘోరంగా వైద్యురాలి చనిపోతే.. ఆర్‌జీ కర్ ఆస్పత్రి ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ మాత్రం బాధితురాలి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుందని సమాచారం ఇచ్చాడు. అనంతరం సందీప్ ఘోష్ రాజీనామా చేశాడు. రాజీనామా చేసిన కొన్ని నిమిషాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం… వేరే మెడికల్‌ కాలేజీలో తిరిగి ప్రిన్సిపాల్ పోస్టు ఇచ్చేసింది. ఈ పరిణామాలు యావత్తు దేశాన్ని ఆశ్చర్యపరిచింది. ఇక వైద్యురాలి హత్యాచార ఘటన వెనుక ఏదో జరుగుతోందని కోల్‌కతా హైకోర్టు భావించి.. సందీప్ ఘోష్ తీరును ఎండగట్టింది. రాష్ట్ర పోలీసులు దర్యాప్తుతో న్యాయం జరగదని భావించిన న్యాయస్థానం కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించింది.

వెలుగులోకి సందీప్ ఘోష్ క్రూరత్వం…
ఇక తాజాగా మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ క్రూరత్వం ఒక్కొక్కొటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇరుగుపొరుగు వారు అతగాడి నైజాన్ని బయట ప్రపంచానికి తెలియజేస్తున్నారు. సందీప్ ఘోష్ భార్య సిజేరియన్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చి ఇంటికి వచ్చిన బాలింతపై దాడి చేయడమే కాకుండా కడుపుపై తన్నినట్లుగా పొరిగింటివారు వెల్లడించారు. సర్జరీ జరిగి 14 రోజులే కావడంతో ఆమె కుట్లు తెరుచుకున్నాయని.. బంధువులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి తిరిగి కుట్లు వేయించారని చెప్పుకొచ్చారు. ప్రతి రోజూ భార్యను హింసిస్తూనే ఉండేవాడని ఇంకొందరు వెల్లడించారు. ఇక ఘోష్ తల్లి కూడా చాలా క్రూరంగా ప్రవర్తించేదని.. కోడలు బాలింతగా ఉంటే కనీసం పట్టించుకునేది కాదని మరికొందరు తెలిపారు.

సందీప్ ఘోష్ కొద్దిరోజులు నార్త్ 24 పరగణాస్ జిల్లా బరాసత్‌లోని మల్లిక్ బగాన్ ప్రాంతంలో నివాసం ఉండేవాడు. ఆ సమయంలో ఇంటి దగ్గరకు రోగులు వస్తుండేవారని.. అందరి దగ్గర అధికంగా డబ్బులు వసూలు చేసేవాడని చెప్పుకొచ్చారు. అతడి చర్యలు వివాదాస్పదం కావడంతోనే శాశ్వతంగా కోల్‌కతా వెళ్లిపోయాడని అక్కడి ప్రజలు పేర్కొన్నారు. ఇక ఘోష్ భార్య కూడా ప్రస్తుతం కోల్‌కతాలోని నిల్ రతన్ సిర్కార్ మెడికల్ కాలేజీలో డాక్టర్‌గా పనిచేస్తోంది. ప్రభుత్వం నుంచి లక్షలాది రూపాయిల జీతం అందుకుంటున్నా.. ఇంటి దగ్గరకు వచ్చే పేషెంట్ల దగ్గర కూడా అధిక స్థాయిలో నగదు తీసుకునేవాడని.. అంత ఘోరమైన వ్యక్తి అని సందీప్ ఘోష్ గురించి స్థానికులు వివరించారు.

ఇక సందీప్ ఘోష్.. ఆస్పత్రిలో విద్యార్థులతో చాలా చీకటి కార్యక్రమాలు చేసేవారని మాజీ ఆస్పత్రి ఉద్యోగులు చెప్పుకొచ్చారు. విద్యార్థులకు మద్యం సరఫరా చేసేవాడని.. అంతేకాకుండా ఒక మాఫియాను తయారు చేశాడని తెలిపారు. కమీషన్ లేకుండా ఏ పనులు చేసేవాడు కాదని మాజీ ఉద్యోగులు తేటతెల్లం చేశారు. పలుమార్లు ఆస్పత్రి నుంచి బదిలీ అయినా కూడా రాజకీయ పలుకబడితో తిరిగి ఆర్‌జీ కర్ ఆస్పత్రిలోనే పోస్టు వేయించుకున్నాడని వెల్లడించారు. ఘోష్ అత్యంత అవినీతి పరుడని.. ఒక మాజీ సీనియర్ అధికారి చెప్పుకొచ్చాడు. మాజీ ఉద్యోగులతో కలిసి ఒక మాఫియాను నడిపేవాడని పేర్కొన్నారు. కమీషన్లు ఇవ్వకపోతే చాలా మంది విద్యార్థులను ఫెయిల్ చేసేవాడని తెలిపారు. ఇక ఆస్పత్రిలో టెండర్ ఆర్డర్లపై 20 శాతం కమీషన్ తీసుకునేవాడని వివరించారు. ఆస్పత్రిలో ఏ పని జరగాలన్న డబ్బు తీసుకోకుండా చేసేవాడు కాదని చెప్పుకొచ్చారు. కొంత మంది విద్యార్థులను తన గెస్ట్‌హౌస్‌కు రప్పించుకుని మద్యం సరఫరా చేసేవాడన్నారు. అతడు ఒక మాఫీయానే తయారు చేశాడని మరొక మాజీ ఉద్యోగి వాపోయాడు.

ఆస్పత్రిలో వైద్యురాలి అత్యంత ఘోరంగా హత్యాచారానికి గురైతే.. కొన్ని గంటల్లోనే రాజీనామా చేసి వెళ్లిపోవడంతో పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. న్యాయం చేయాల్సిన వాడు.. ప్రక్క ప్రణాళికతో తప్పించుకుని వెళ్లిపోయాడు. మొత్తానికి పాపం పండి.. అతడి ఘోరాలు ఒక్కొక్కొటిగా వెలుగులోకి వస్తున్నాయి. రంగంలోకి దిగిన సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తోంది. పోస్టుమార్టం రిపోర్టుతో వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్లుగా దర్యాప్తు సంస్థ భావిస్తున్నట్లు సమాచారం.