Punjab: మతమౌఢ్యానికి ఓ వ్యక్తి బలయ్యాడు. పంజాబ్ గురుదాస్‌పూర్ జిల్లాలో 30 ఏళ్ల వ్యక్తి దెయ్యం వదిలిస్తానని చెబుతూ ఓ పాస్టర్, అతని 8 మంది సహచరులు సదరు వ్యక్తిని దారుణంగా కొట్టారు. అతని శరీరం నుంచి దెయ్యాన్ని వదిలించడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంటూ కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడైన పాస్టర్‌పై కేసు నమోదు చేశారు.
బాధిత వ్యక్తిని సామ్యూల్ మాసిహ్‌గా గుర్తించారు. ఇతను రోజూవారీ కూలీగా పనిచేస్తున్నాడు. సామ్యూల్ మూర్ఛ రోగంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. పరిస్థితిపై ఆందోళన చెందిన శామ్యూల్ కుటుంబం బుధవారం ప్రార్థన కోసం అని పాస్టర్ జాకబ్ మాసిహ్‌ని ఇంటికి పిలిచినట్లు పోలీసులు తెలిపారు. శామ్యూల్‌కి దెయ్యం పట్టిందని పాస్టర్ పేర్కొన్నాడు. అతని శరీరం నుంచి దెయ్యం బలవంతంగా బయటకు పోతుందని చెప్పాడు.
పాస్టర్, అతని సహచరులు శామ్యూల్‌పై దారుణంగా దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మరణించినట్లు తెలిసింది. మంచంపై పడుకున్న స్థితిలో ప్రాణాలు లేకుండా శామ్యూల్ పడి ఉన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అతడి అంత్యక్రియల తర్వాత పాస్టర్‌పై ఫిర్యాదు చేశారు. శనివారం డ్యూటీ మేజిస్ట్రేట్ ఇందర్‌జిత్ కౌర్ నేతృత్వంలో పోలీసులు శామ్యూల్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. జాకబ్ మసీహ్, బల్జీత్ సింగ్ సోనూ తదితరులపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
