Psycho Husband Tortured Wife In Front Of Friends: పెళ్లికి ముందు కొందరు మగాళ్లు ఏవేవో వాగ్దానాలు చేస్తారు. ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా, కంటికి రెప్పలా కాపాడుకున్నాడంటూ నమ్మబలుకుతారు. కానీ, పెళ్లయ్యాక తమ నిజ స్వరూపం బయటపెడతారు. భార్యల్ని హింసిస్తూ.. రాక్షసత్వం ప్రదర్శిస్తుంటారు. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి కూడా అదే పని చేశాడు. పెళ్లికి ముందు అమాయకుడిలా కనిపించిన అతడు, పెళ్లయ్యాక తన అసలు రంగు బయటపెట్టాడు. భార్యని హింసించడంతో పాటు పదే పదే గర్భస్రావం చేయించాడు. దీంతో విసుగెత్తిపోయిన ఆ మహిళ.. చివరికి పోలీసుల్ని ఆశ్రయించడంతో, అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
బెంగళూరులోని బాణసవాడి ప్రాంతంలో నివసిస్తోన్న ప్రదీప్ అనే వ్యక్తి.. కొన్నాళ్ల క్రితం ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, పెళ్లైన కొన్ని రోజుల నుంచే అతడు భార్యని హింసించడం మొదలుపెట్టాడు. ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి, ఆమెపై చిత్రహింసలకు పాల్పడేవాడు. ఆమెను కొట్టడంతో పాటు సిగరెట్‌తో వాతలు పెట్టేవాడు. అంతేకాదు.. అశ్లీల వీడియోలు చూపించి వేధింపులకు కూడా గురిచేశాడు. రోజూ భర్త వేధింపులు ఎక్కువ అవ్వడంతో, ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పుడు పెద్దలు సర్దిచెప్పడం, తాను కూడా మారిపోతానని మాటివ్వడంతో.. ఆమె తిరిగి కాపురానికి వచ్చింది. మొదట్లో కొన్నిరోజులు బాగానే ఉన్నట్టు నటించాడు, కానీ ఆ తర్వాత మళ్ళీ వేధింపులు పెట్టడం మొదలుపెట్టాడు.
ఒకట్రెండు సార్లు ఆమె గర్భం దాలిస్తే, ఏవేవో కథలు చెప్పి బలవంతంగా అబార్షన్ చేయించాడు. అంతటితో అతని కర్కశత్వం ఆగలేదు.. పార్టీ కోసమని స్నేహితుల్ని ఇంటికి పిలిపించి, వారి ముందే భార్యను హింసించేవాడు. ఇదేంటని ప్రశ్నిస్తే.. విడాకులు ఇస్తానని బెదిరించేవాడు. ఎలాగోలా ఇన్నాళ్లూ భరించిన ఆమె.. చివరికి అతడ్ని వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. పోలీసుల్ని ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి, ప్రదీప్‌ని అరెస్ట్ చేశారు.
