Site icon NTV Telugu

Karimnagar Murder: యూట్యూబ్‌లో మర్డర్ వీడియోలు చూసి.. సవతి తల్లి హత్య

Murdered

Murdered

Karimnagar Murder: ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని చెప్పి సవతి తల్లిని హత్య చేశారు. ఈ విషయంలో తండ్రి కూడా వారికి సహకరించాడు. మొత్తంగా స్కెచ్ వేసి ఆమెను చంపేశారు. ఆస్తి సంగతి పక్కకు పెడితే ఇప్పుడు ఇంటిల్లిపాది.. మర్డర్ కేసులో ఇరుక్కుని ఊచలు లెక్కబెడుతున్నారు. కరీంనగర్ జిల్లా టేకుర్తిలో ఈ ఘటన జరిగింది. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం టేకుర్తిలో దారుణం జరిగింది. నిండు గర్భిణిని దారుణంగా హత్య చేశారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేశారు..

READ ALSO: కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

టేకుర్తిలో ముద్రబోయిన రాములు- రేణుక నివసిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు. అయితే రాములు ఏడు సంవత్సరాల క్రితం భర్తను వదిలి ఒంటరిగా ఉంటున్న చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన తిరుమల అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో తనకు పెళ్లి అయిన విషయాన్ని దాచిపెట్టి పెళ్లాడాడు. ఈ క్రమంలో కొన్ని రోజులు రెండో వివాహం గురించి మొదటి భార్యకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. విషయం తెలిసిన తరువాత రెండు ఇళ్లల్లో గొడవలు షురూ అయ్యాయి. అయితే వాటన్నింటినీ సద్దుమణిగేలా చేసి.. ఇద్దరు భార్యలతో ఒకే ఊర్లో వేర్వేరుగా కాపురం పెట్టాడు…

అంతా బాగుందనుకున్న సమయంలో తిరుమల గర్భం దాల్చింది. ప్రస్తుతం ఏడు నెలల గర్భిణీ. ఈ క్రమంలో ముద్రబోయిన రాములు కుటుంబం ఆమెపై కక్ష కట్టింది. ఆమెకు పిల్లలు పుడితే ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని.. కన్నింగ్ ఆలోచనకు తెర తీసింది. దీంతో ఆమెను కడతేర్చితే.. అసలు ఆస్తిలో వాటా ఇవ్వాల్సిన అవసరం ఉండదని ప్లాన్ చేశారు.

ఇక ఈ ప్లాన్ అమలు చేసేందుకు చిన్న కొడుకు బన్నీతేజ్‌ను ప్రేరేపించారు. అప్పటికే చెడు అలవాట్లకు బానిసైన బన్నీ తేజ్.. మర్డర్ కోసం ప్రిపేర్ అయ్యాడు. అమెజాన్ ద్వారా కత్తి కూడా తెప్పించాడు. ఇక యూట్యూబ్‌లో మర్డర్ ఎలా చేయాలి అనే వీడియోలు చూశాడు. అదను కోసం వేచి చూసి.. చివరకు తిరుమల ఇంటి చుట్టు పక్కల ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డాడు. అతి దారుణంగా ముఖంపై కత్తితో వేటు వేశాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు..

ఈ కేసులో ముద్రబోయిన రాములు, అతని మొదటి భార్య, నిందితుడు బన్నీతేజ్‌తోపాటు మరో కుమారున్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మర్డర్ కేసుతోపాటు మాదక ద్రవ్యాలు సేవించిన కేసులు నమోదు చేశారు… అమాయకురాలైన తిరుమలను అతి దారుణంగా హత్య చేసిన ముద్రబోయిన రాములు కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కనీసం నిండు గర్భిణీ అని కూడా చూడకుండా చంపేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

READ ALSO: SBI Cashier Scam: కంత్రీ క్యాషియర్.. నోట్ల కట్టలతో బెట్టింగ్ ఆటలు

Exit mobile version