UP News: బ్లూ డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. భూమి కింద కోట్ల రూపాయల నగదు..

  • నేల కింద డ్రమ్ముల్లో కోట్ల రూపాయల నగదు..
  • ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో పట్టుబడిన డబ్బులు..
Up News

Up News

UP News: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఇంటి వరండాలో భూమిని తవ్వగా, నేల కింద ఉన్న మూడు నీలి రంగు డ్రమ్ముల్లో కోట్ల రూపాయలు బయటపడ్డాయి. నగదు కట్టలు కట్టలుగా కనిపించడంతో దీనిని చూసిన అధికారులు షాక్‌కు గురయ్యారు. ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ నగదు కోట్లలో ఉండొచ్చని తెలుస్తోంది.

ప్రయాగ్‌రాజ్‌లోని గంగానగర్ జోన్ పరిధిలో ఉన్న నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరాయిపూర్ రామ్‌నగర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో భారీ మొత్తంలో నగదు భూమి కింద ఉందనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో నవాబ్ గంజ్, సోరాన్ పోలీస్ స్టేషన్లకు చెందిన అధికారులు చర్యలు తీసుకున్నారు. సోరాన్ ఏసీపీ శ్యామ్‌జీ, ఫుల్‌పూర్ ఏసీపీ రాజ్‌కుమార్ సింగ్ సమక్షంలో ఇంటి వరండాలో తవ్వకాలు చేపట్టారు.

నేల కింద పాతిపెట్టిన మూడు డ్రమ్ముల్లో రూ. 500 నోట్ల కట్టలు లెక్కకు మించి కనిపించడంతో అవాక్కయ్యారు. నోట్లు పాడవకుండా ఉండేందుకు డమ్ముల్లోని కరెన్సీకి పాలిథీన్ కవర్లు చుట్టి ఉంచారు. ఈ ఘటనలో రాకేష్ యాదవ్, రాజేష్ యాదవ్ అనే ఇద్దరు సోదరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో భద్రపరిచారు. అయితే, నగదు ఎంతనే వివరాలను ఇంకా అధికారులు వెల్లడించలేదు.

రియల్ ఎస్టేట్‌లో వచ్చిన డబ్బా..?

గ్రామస్తులు చెబుతున్న దాని ప్రకారం.. రాజేష్, రాకేష్ యాదవ్‌లు గతంలో పూణేలోని ఓ కంపెనీలో పనిచేశారు. ఆ తర్వాత కొన్నేళ్లుగా గ్రామంలో అనేక ఎకరాల భూమిని కొనుగోలు చేయడంతో పాటు ఇళ్లు, దుకాణాలను కూడా కొనుగోలు చేశారు. వీరి ఇంటి సమీపంలో ఓ ఆలయ నిర్మాణం కూడా జరుగుతోందని సమాచారం. ఆలయ నిర్మాణం కోసం విరాళలు సేకరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే, ఈ ఆరోపణలు ఇంకా నిర్ధారణ కాలేదు. సోదరుల ఆస్తులు, ఆర్థిక లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

నవరాత్రుల సమయంలో వివాదం..?

శరద్ నవరాత్రుల సమయంలో అమ్మవారి విగ్రహ నిమజ్జనం విషయంలో వివాదం తలెత్తింది. ఆ తర్వాత ఇంట్లో అక్రమంగా నగదు దాచినట్లు పోలీసులకు సమాచారం అందినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే, ఈ పరిణామాలకు, నగదు గురించి సమాచారాని సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

భారీ మొత్తంలో నగదు లభించడంతో ఆదాయపు పన్ను అధికారులు, జీఎస్టీ అధికారుల, ఇతర దర్యాప్తు సంస్థలకు పోలీసులు సమాచారం అందించారు. నగదు మూలాలు, దాని చట్టబద్ధత, సంబంధిత ఆర్థిక లావాదేవీలపై ఆయా సంస్థలతో విచారణ జరిపే అవకాశం ఉంది.