Vani Jayaram: ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం కన్నుమూశారు.. అయితే, తన నివాసం విగత జీవిగా ఆమె పడి ఉన్న తీరు, ఆమె ముఖంపై గాయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.. దీంతో, వాణీ జయరాం తూలిపడి మృతిచెందారా? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు.. వాణీ జయరాం మృతిపై అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసినా త్రిబుల్ కేన్ పోలీసులు.. ఆమె తలకు తీవ్రగాయం ఉండటంతో పని మనిషి ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. ఇక, ఫోరెన్సిక్ నిపుణులను కూడా రంగంలోకి దించారు.. వాణీ జయరాం నివాసానికి చేరుకున్న ఫోరెన్సిక్ టీమ్.. అక్కడ ఆధారాలను సేకరించారు.. మరోవైపు.. వాణీ జయరాం మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతుండడంతో.. ఒమేదురార్ ప్రభుత్వాస్పత్రిలో ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
Read Also: Vani Jayaram: వాణీ జయరామ్‌కు తెలుగువారితో ‘ఎన్నెన్నో జన్మలబంధం’
అయితే, వాణీ జయరాం మృతి కేసులో ఏం జరిగిందనే విషయాల్లోకి వెళ్తే.. రోజూలానే ఆమె ఇంట్లో పని మనిషిగా చేస్తున్న మహిళ.. ఇవాళ కూడా వాణీ జయరాం నివాసానికి వెళ్లింది.. ఇంట్లోకి వెళ్లేందుకు కాలింగ్ బెల్ ప్రెస్ కొట్టింది.. అయితే, ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా తలుపు తీయకపోవడంతో.. ఆందోళనకు గురైన పనిమనిషి.. వాణీ జయరాం బంధువులకు సమాచారం చేరవేశారు.. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ఇక, పోలీసులు వచ్చి డోర్‌ను బద్ధలు కొట్టి చూడగా ముఖంపై తీవ్ర గాయాలతో విగత జీవిగా వాణీజయరాం పడి ఉన్నారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.. మొత్తంగా పనిమనిషి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.. వాణీ జయరాం భర్త జయరాం 2018లో కన్నుమూశారు.. వారికి పిల్లలు కూడా లేకపోవడంతో.. ఆమె ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నారు. వాణీజయరాం అసలు పేరు కలైవాణి.. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో ఆమె ఐదో సంతానం.. కర్ణాటక సంగీతాన్ని ఔపోసన పట్టిన వాణీ జయరాం.. 1971లో గాయనిగా సినీరంగ ప్రవేశం.. తెలుగు, తమిళం, హిందీ, మళయాళం, గుజరాతీ, ఒరియా సహా 19 భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడి.. తనదైన ముద్రవేశారు.. మూడు సార్లు జాతీయ ఉత్తమ గాయనిగా పురస్కారం అందుకున్న వాణీ జయరాం.. పాడిన తొలి పాటకే ఐదు అవార్డులు అందుకోవడం విశేషం.. ఇక, మొన్నటికిమొన్న కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డును కూడా ప్రకటించింది.. కానీ, అమె పద్మా అవార్డును అందుకోకుండానే కన్నుమూశారు.