NTV Telugu Site icon

బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశించిన పేర్ని నాని

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు పడి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మృతిచెందిన వారిలో డ్రైవర్‌తో పాటు 6 గురు మహిళలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటన సమాచారం అందటంతోనే పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అధికారులు వచ్చేలోపే స్థానికులు పడవల సహాయంతో బాధితులు ఒడ్డుకు చేర్చారు. అయితే ఈ ప్రమాదంతో కొంత మంది గల్లంతయ్యారు. వారికోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. బాధిత కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.

అంతేకాకుండా ఈ ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన చికిత్స అందిచాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనపై మంత్రి పేర్ని నాని విచారణకు ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక అందించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ప్రమాదంలో గాయపడినవారి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని సీఎం చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు.