1020 Movies Hacked: కిక్ కోసం ఏమైనా చేస్తాం… ఎంత దూరమైనా వెళ్తాం..ఇది చాలా మందికి అలవాటే. కానీ పాట్నాలోని ఓ 22 ఏళ్ల కుర్రాడు.. కిక్ కోసం చేసిన పనికి పోలీసులే షాక్ అయ్యారు. పోలీసులే కాదు.. అతడు కిక్ కోసం చేసిన పనులను చూస్తే ఎవరైనా ఔరా అని ముక్కున వేలేసుకోవాల్సిందే! ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు ఏం చేశాడు? ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు.. అశ్వినీ కుమార్. బీహార్‌లోని పాట్నా నివాస స్థలం. వయసు 22 ఏళ్లు.. చదివింది ఇంటర్మీడియెట్. కానీ హ్యాకింగ్‌లో మాత్రం దిట్ట. హ్యాకింగ్ చేయడంలో మహామహులనే మించిపోయాడు. ఐతే ఏకంగా 1020 సినిమాలు హ్యాక్ చేసి ఇప్పుడు పోలీసులకు చిక్కాడు. అతని వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది…
READ ALSO: London: లండన్‌లో మహాత్మా గాంధీకి అవమానం.. స్పందించిన భారత్
నిజానికి అశ్వినీ కుమార్‌కు సమాజం మీద కోపం.. వ్యక్తులు అంటే గిట్టదు.. అంతేకాదు ఒక కన్ను పని చేయని కారణంగా సమాజం తనను చిన్నచూపు చూసిందన్న భావన ఎప్పుడూ మనసులో మెదులుతూ ఉండేది. స్కూల్లో ఉన్నప్పుడు తోటి విద్యార్థులు హేళన చేసేవారు. కాలేజీలోనూ అదే పరిస్థితి. అందరూ ఒంటికన్ను శివరాజన్ అనేవారు. దీంట్లో అతనిలో కసి పెరిగింది. తాను ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. తనకు తానుగా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నాడు. మొదట్లో యూట్యూబ్‌లో అన్నీ సెర్చ్ చేశాడు. చివరికి హ్యాకింగ్ చేయడం నేర్చుకున్నాడు. అంతేకాదు ఇంటర్నెట్లో ఏ డేటాను ఎలా తస్కరించాలో కూడా నేర్చుకున్నాడు. ఈ క్రమంలో ఎప్పుడూ కంప్యూటర్ మీదనే ఉండేవాడు. దీంతో తల్లి అతన్ని తీవ్రంగా మందలించింది. కోపం పెరిగిపోయి చితకబాదింది. కానీ తన ప్రయత్నాన్ని ఆపలేదు అశ్వినీ కుమార్. అర్ధరాత్రి తల్లి పడుకున్న తర్వాత నుంచి తెల్లవారుజాము వరకు ఇంటర్నెట్‌పై పని చేశాడు…
కొత్త సినిమాలు డౌన్‌లోడ్ చేయడం మొదలు పెట్టాడు
హ్యాకింగ్‌లో పూర్తిస్థాయి పరిజ్ఞానం వచ్చిన తర్వాత.. దాన్ని చెక్ చేసేందుకు కొత్త సినిమాలు డౌన్‌లోడ్ చేయడం మొదలు పెట్టాడు. ఇందుకోసం వారి సర్వర్లను హ్యాక్ చేశాడు. వాటిని డౌన్ లోడ్ చేసి.. అందరికంటే ముందుగానే సినిమా చూశాననే ఆనందం పొందేవాడు. ఆ కిక్ కోసం చేసిన పని కాస్తా.. కొన్ని వెబ్‌సైట్లు డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేసే సరికి.. ఆ దిశగా పని చేశాడు. కొత్త సినిమాల కోసం కొన్ని ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ అతనికి ప్రతి నెలా లక్షల రూపాయలు చెల్లిస్తున్నాయి. వాటిని బిట్ కాయిన్స్ రూపంలో చెల్లింపు చేస్తున్నాయి… మరోవైపు.. అశ్వినీ కుమార్ అక్కడితో ఆగిపోలేదు. బీహార్ ప్రభుత్వం, ఝార్ఖండ్‌తోపాటు కేంద్ర ప్రభుత్వం వెబ్‌సైట్లను హ్యాక్ చేశాడు. చివరికి ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్ కూడా హ్యాక్ చేశాడు. ఇందుకోసం జావా, పైథాన్‌తోపాటు తనకు వచ్చిన కోడింగ్ ద్వారా క్రాక్ చేసినట్లు తెలుస్తోంది.
అంతే కాదు తన సైబర్ సెక్యూరిటీ విషయంలోనూ అశ్వినీ కుమార్ చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఇంటి చుట్టూ 22 కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడు. తెలంగాణ పోలీసులు పట్టుకునేందుకు వెళ్లిన సమయంలోనూ తన మొబైల్‌లో ఉన్న డేటా అంతా చిటికెలో డిలీట్ చేసేశాడు. కానీ హార్డ్ డిస్క్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా పోలీసులు అశ్వినీ కుమార్ సత్తా గురించి తెలుసుకుని షాకయ్యారు. ఇదంతా ఎందుకు చేశావని అడిగితే.. జస్ట్ కిక్ కోసం అంటూ అతను ఇచ్చిన సమాధానంతో మరింత షాకయ్యారు పోలీసులు.
READ ALSO: Ganja Racket: తగ్గేదేలే అంటున్న గంజాయి స్మగ్లర్స్.. కానీ!
