ఉద్యోగం చేసే తల్లిదండ్రులకు పిల్లల బాధ్యత భారంగా మారుతోంది. దీంతో పిల్లలను డే కేర్ సెంటర్లలో వదిలేసి జాబ్స్ చేసుకోవాల్సిన దుస్థితి దాపురిస్తోంది. మరి అభం శుభం తెలియని పిల్లలను ఆయా డే కేర్ సెంటర్లలో ఉండే ఆయాలు సరిగ్గానే చూసుకుంటున్నారు. తల్లిదండ్రుల స్థానాన్ని భర్తీ చేసే విధంగా వారికి ప్రేమను పంచుతున్నారా..? అంటే ఇది మిలియన్ డాలర్ల క్వశ్చన్‌లాగే మిగులుతోంది. ఇప్పుడు నోయిడాలోని ఓ డే కేర్ సెంటర్లో వెలుగు చూసిన వాస్తవం.. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో కళ్లకు కడుతోంది. ఇంతకీ ఆ డే కేర్ సెంటర్లో ఏం జరిగింది?
పసిపిల్లలను సున్నితంగా చూసుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అక్కడి మహిళా సిబ్బంది అతి క్రూరంగా ప్రవర్తించారు… ఇది ఎక్కడో కాదు.. దేశ రాజధాని ఢిల్లీ పక్కనే ఉన్న నోయిడాలో జరిగింది. ఇక్కడ చూడండి.. ఇది నోయిడా సెక్టార్‌లోని పరస్ తీరియా రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో ఉన్న డే కేర్ సెంటర్. దీన్ని అదే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అసోసియేషన్ స్వయంగా నిర్వహిస్తోంది. ముగ్గురు మహిళా సిబ్బంది పని చేస్తున్నారు…
తల్లిదండ్రులు తమ పిల్లలను రోజూ డే కేర్ సెంటర్లో వదిలేసి.. ఉద్యోగాలకు వెళ్తుంటారు. సాయంత్రం రాగానే పిల్లలను ఇంటికి తీసుకెళ్తారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ సందీప్ అనే వ్యక్తి కూతురును డే కేర్ సెంటర్లో మహిళా సిబ్బంది ఒకరు దారుణంగా హింసించారు. పాప ఏడుస్తోందన్న ఒకే ఒక్క కారణంతో ఆమె చేసిన పని డే కేర్ సెంటర్ కు బ్యాడ్ నేమ్ తెచ్చింది…
డే కేర్ సెంటర్‌లో పని చేసే మహిళా సిబ్బంది చిన్నారిపై ఘాతుకానికి ఒడిగట్టింది. చిన్నారిని చిత్రహింసలు పెట్టింది. కొట్టి, కొరికి గాయాలపాలు చేసింది. రెండు రోజుల క్రితం చిన్నారి శరీరంపై తల్లిదండ్రులు గాయాలు గుర్తించారు. అలర్జీ కారణంగా అలా అయిందేమో అని అనుకున్నారు. డే కేర్ సెంటర్‌లోని టీచర్లు ఆ గాయాలపైన అనుమానం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పుడు ఆస్పత్రిలో వాటిని పంటి గాట్లుగా గుర్తించారు వైద్యులు. ఇది విని తల్లిదండ్రులు షాక్ అయ్యారు…
చిన్నారిని కొరికింది ఎవరో తెలుసుకోవడానికి డే కేర్ సెంటర్‌లోని సీసీటీవీ కెమెరాలను చెక్ చేశారు. దీంతో భయంకరమైన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళా సిబ్బందిని అరెస్ట్ చేశారు. నెలకు 2,500 రూపాయలు తీసుకుంటూ కూడా చిన్నారిని సరిగా చూసుకోలేకపోయారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా సిబ్బంది మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..
