Site icon NTV Telugu

Mother kills Son: బిడ్డల కోసం.. కన్న కొడును చంపేసిన తల్లి

Mother Kills Son

Mother Kills Son

Mother kills Son: ఆస్తులు, కుటుంబ కలహాలు.. కారణాలు ఏవైనా.. అయిన వాళ్లే.. కొంత మందికి శత్రువులుగా మారుతున్నారు. ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో క్షణికావేశంలో ఏం చేస్తున్నారో కూడా కొంత మందికి తెలియడం లేదు. కానీ క్షణాల్లో ఘోరం మాత్రం జరిగిపోతోంది. ఈ తరహాలోనే నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. కన్న తల్లి కొడుకును హతమార్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఆయన పేరు సుధాకర్. నంద్యాల జిల్లా వెలుగోడు మండలం మోతుకూరులో భార్య జ్యోతితో కలిసి ఉంటున్నాడు. ఇతన్ని కన్న తల్లి వెంకట శివమ్మ దారుణంగా చంపేసింది. భూవివాదంలో హత్య చేసినట్లుగా తెలుస్తోంది..

READ ALSO: OG : ఏపీలో పవన్ ఫ్యాన్స్ అలెర్ట్.. ఓజీ ప్రీమియర్స్ టైమ్ ఛేంజ్..

ఇద్దరు కూతుళ్లకు తలో ఎకరం భూమి ఇవ్వాలన్న తల్లి
సుధాకర్‌కు, ఆయన తల్లితో 6 నెలల నుంచి భూవివాదం ఉంది. తన తండ్రికి చెందిన పొలంలో తన భాగం తనకు ఇవ్వాలని సుధాకర్ కోరుతున్నాడు. కానీ ఇద్దరు కూతుళ్లకు కూడా తలో ఎకరం భూమి ఇవ్వాలని తల్లి చెబుతోంది. దీనికి సుధాకర్ ససేమిరా అన్నాడు. ఈ మధ్యే పండగ కోసం ఇద్దరు కూతుళ్లు ఇంటికి వచ్చారు. దీంతో భూవివాదం మళ్లీ రాజుకుంది. నిజానికి భార్యతో కలిసి వేరు కాపురం ఉంటున్న సుధాకర్.. మరోసారి తల్లి, చెల్లెళ్లకు నచ్చ చెప్పేందుకు తమ్ముని ఇంట్లో ఉంటున్న తల్లి దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో సుధాకర్ మృతి చెందాడు.

కంట్లో కారం చల్లి..
తన భర్త సుధాకర్‌ కంట్లో కారం చల్లి.. కట్టుకున్న చీరతోనే ఉరి వేసి కన్న తల్లి వెంకట శివమ్మ చంపేసిందని సుధాకర్ భార్య జ్యోతి ఆరోపించింది. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐతే కొడుకు మృతిపై తల్లి వెంకట శివమ్మ వాదన మరోలా ఉంది. ఇంట్లో ఘర్షణ జరిగిన మాట వాస్తవమేనన్న ఆమె.. మద్యం మత్తులో విసిగిస్తున్నాడని తెలిపింది. ఐతే తోపులాటలో గాయపడి చనిపోయినట్లు ఆమె చెబుతోంది.. మొత్తానికి ఆస్తి వివాదమో.. కుటుంబ కలహాలో.. కారణం ఏదైనా సుధాకర్ మాత్రం మృతి చెందాడు. ప్రస్తుతానికి ఈ కేసులో తల్లి వెంకట శివమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

READ ALSO: Rajinikanth – Kamal Haasan: రజనీ- కమల్ హాసన్‌ను డీల్ చేసే దమ్మెవరికుంది?

Exit mobile version