T-shirt: కేవలం రూ. 300 టీ-షర్టుపై చెలరేగిన వివాదం ఒక వ్యక్తి ప్రాణాలను తీసింది. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో టీ షర్టుపై చెలరేగిన వివాదం స్నేహితుడైన 30 ఏళ్ల వ్యక్తిని హత్య చేయడానికి కారణమైంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం శాంతి నగర్ ప్రాంతంలో శుభమ్ హర్నే(30) అనే వ్యక్తి , టీ-షర్టు కొనుగోలు చేసిన అక్షయ్ ఆసోల్(26)కి రూ. 300 చెల్లించడానికి నిరాకరించాడు. దీనిని అక్షయ్ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశారు. ఇది అతడికి సరిపోకపోవడంతో శుభమ్‌కి ఇచ్చాడు. అయితే శుభమ్ డబ్బులు మాత్రం ఇవ్వలేదు.
Read Also: Aghori Arrested: వేములవాడ ఆలయంలోని దర్గాను కూల్చివేయడానికి వెళ్తున్న అఘోరి.. అడ్డుకున్న పోలీసులు
అయితే, టీషర్టుకి డబ్బులు చెల్లించడానికి నిరాకరించడంతో అక్షయ్, శుభమ్ మధ్య వాగ్వాదం చెలరేగింది. గొడవ పెద్దది కావడంతో శుభమ్ అక్షయ్‌ని తిడుతూ డబ్బును అతడిపైకి విసిరాడు. ఘటన తర్వాత అక్షయ్ అతడి సోదరుడు ప్రయాగ్ అసోల్ కోపంతో శుభమ్ గొంతు కోశారు. దీంతో శుభం అక్కడికక్కడే మరణించాడు. ఘటన సమయంలో సోదరులిద్దరూ మద్యం తాగి ఉన్నారని నాగ్‌పూర్ పోలీస్ డీఎస్పీ మోహక్ స్వామి తెలిపారు. ఈ ఘటన తర్వాత అన్నదమ్ములిద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. శుభమ్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. ముగ్గురికి కూడా నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.