NTV Telugu Site icon

Digital Arrest: డిజిటల్ అరెస్ట్ స్కామ్ ప్రధాన సూత్రధారి అరెస్ట్

Digital Arrest

Digital Arrest

దేశ వ్యాప్తంగా ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న మాట డిజిటల్ అరెస్ట్. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయి.. అమాయకుల బలహీనతను అడ్డంపెట్టుకుని బెదిరింపులకు దిగి లక్షల్లో.. కోట్లలో నగదు కాజేస్తున్నారు. అనంతరం బాధితులు లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వరుసగా డిజిటల్ అరెస్ట్ కేసులు ఎక్కువైపోయాయి. దేశ వ్యాప్తంగా ఆయా నగరాల్లో పదులకొద్దీ కేసులు నమోదవ్వడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. తాజాగా కోల్‌కతా పోలీసులు.. డిజిటల్ అరెస్ట్ స్కామ్ సూత్రధారుడ్ని అరెస్ట్ చేశారు.

సైబర్ నేరగాళ్లు.. డిజిటల్ అరెస్ట్ పేరుతో వీడియో కాల్స్ చేసి అధికారులుగా నటిస్తారు. లేనిపోని కేసులతో భయాందోళనకు గురి చేసి అరెస్ట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతారు. అనంతరం మరొకరు ఫోన్ చేసి.. డబ్బులు బదిలీ చేయాలంటూ బలవంతం చేస్తారు. అలా దఫదఫాలుగా లక్షల్లో.. కోట్లలో నగదు కాజేస్తుంటారు. ఇలా దేశ వ్యాప్తంగా ఎంతో మంది కోట్లాది రూపాయులు పోగొట్టుకున్నారు.

తాజాగా ఈ స్కామ్‌లో ప్రధాన సూత్రధారుడైన చిరాగ్ కపూర్‌ను కోల్‌కతా పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఇతడిపై 930 కేసులతో సంబంధం ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటి వరకు ఈ కేసులో 10 మంది వరకు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను జురిస్డిక్షనల్ కోర్టు ముందు హాజరు పరుస్తామని.. అలాగే ట్రాన్సిట్ కస్టడీని కోరతామని పోలీసులు తెలిపారు.

దేబాశ్రీ దత్తా అనే ఫిర్యాదుదారుడిని నిషేధిత డ్రగ్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు దిగారు. దీంతో అతడి ఖాతా నుంచి రూ.47 లక్షలు దోచుకున్నారు. దేబాశ్రీ దత్తా ఖాతా నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయిన బ్యాంక్ ఖాతా ఆధారంగా సెప్టెంబర్ 28, 2024న కేసు నమోదు చేసి విస్తృతంగా దాడులు చేశారు. ఆనందపూర్, పటులి, నరేంద్రపూర్‌లో ఎనిమిది మందిని అరెస్ట్ చేయడంతో పాటు తాత్కాలిక కార్యాలయాన్ని కూల్చేశారు. 104 పాస్ బుక్‌లు, 61 మొబైల్ ఫోన్లు, 33 డెబిట్ కార్డులు, రెండు క్యూఆర్ కోడ్ మిషన్లు, 140 సిమ్ కార్డులు, 40 సీల్స్, 10 లీజు అగ్రిమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరగాళ్లు.. స్కామ్ చేయడానికి ఈ కార్యాలయాన్ని ఉపయోగించినట్లు సమాచారం.

చిరాగ్ కపూర్ ఏజెంట్ల ద్వారా స్కామ్‌ను నిర్వహించాడని, అనుమానం రాకుండా దూరంగా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. తదుపరి దర్యాప్తులో ఫేక్ అకౌంట్‌లను సృష్టించడానికి బాధ్యుడైన కపూర్ సహచరుల్లో ఒకరిని 2024 అక్టోబర్ 26న ఢిల్లీలో అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. చిరాగ్ కపూర్‌ను కోల్‌కతా పోలీసు బృందం జనవరి 9, 2025న ఉదయం 4:30 గంటలకు బెంగళూరులో పట్టుకున్నారు. అతని దగ్గర నుంచి మూడు రౌటర్లు, రెండు హార్డ్ డిస్క్‌లు, ఒక ల్యాప్‌టాప్, ఒక బీటెల్ ల్యాండ్‌లైన్ ఫోన్, సిమ్ కార్డులున్న నాలుగు మొబైల్ ఫోన్లు, ఐదు సిమ్ కార్డులు, మూడు పాన్ కార్డులు, నాలుగు చెక్‌బుక్‌లు, ఒక యూఎస్‌బీ డ్రైవ్, వివిధ కంపెనీల పేర్లతో కూడిన ఆరు రబ్బర్ స్టాంపులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Show comments