ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణమైన హత్య జరిగింది. ఫిస్టల్‌తో ఓ వివాహితను ఆమె నివాసంలోనే కాల్చి హత్య చేశారు. ఈ ఘటన హాపూర్ జిల్లా పిల్ఖువా ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. న్యూ ఆర్యనగర్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల బాబ్లీని బుధవారం ఉదయం ఆమె ఇంట్లో కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో ఇంట్లో బాబ్లీతో పాటు ఆమె భర్త సచిన్ మాత్రమే ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు భర్తపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతదేహం సమీపంలో ఒక ఫిస్టల్ లభ్యమవడంతో ఇది హత్యేనని ప్రాథమికంగా నిర్ధారించారు. ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించి ఆధారాలను సేకరించిన పోలీసులు, సంఘటన స్థలాన్ని సీలింగ్ చేసి విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర షాక్‌కు గురయ్యారు. పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాబ్లీ, ఆమె భర్త సచిన్ మధ్య గత కొంతకాలంగా గృహ వివాదాలు కొనసాగుతున్నాయని స్థానికులు వెల్లడించారు. ఇద్దరూ తరచూ మద్యం సేవించి గొడవ పడేవారని, మంగళవారం రాత్రి కూడా వారి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. సంఘటన జరిగిన సమయంలో గదిలో ఇద్దరే ఉండటం, అలాగే పిస్టల్ అక్కడే లభించడం వల్ల భర్తపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
ఈ ఘటనపై పిల్ఖువా కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య కేసు నమోదు చేసినట్లు హాపూర్ జిల్లా ఎస్పీ కున్వర్ జ్ఞానంజయ్ సింగ్ తెలిపారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితుడిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
