NTV Telugu Site icon

Crime News: మహిళపై అత్యాచారం.. సీఐ సస్పెండ్

Ci Crime News

Ci Crime News

రక్షణ కల్పించాల్సిన రక్షక భటుడే భక్షకుడిగా మారాడు. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడడంతో పాటు ఆమె భర్తని తుపాకీతో బెదిరించాడు. చివరికి విధి రాసిన వింత నాటకంలో అడ్డంగా బుక్కయ్యాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అధికారి పేరు నాగేశ్వరరావు. మారేడుపల్లి సీఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈనెల 7వ తేదీన హస్తినాపురంలో నివనిస్తోన్న ఓ మహిళ ఇంటికి వెళ్లిన సీఐ.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బయటకు వెళ్లిన భర్త తిరిగి ఇంటికి రావడంతో.. అతడ్ని తుపాకీతో బెదిరించాడు.

తన బండారం బయటపడకూడదన్న ఉద్దేశంతో.. దంపతులిద్దరినీ కారులో ఎక్కించుకొని ఇబ్రహీంపట్నం వైపుకు వెళ్లాడు. అయితే, మార్గమధ్యంలో కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. దీంతో.. దంపతులిద్దరూ సీఐ నుంచి తప్పించుకొని, వనస్థలిపురం పోలీసుల్ని ఆశ్రయించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ నాగేశ్వరరావుపై ఐటీసీ సెక్షన్స్ 452, 376(2), 307, 448, 365లతో పాటు ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ ఆఫ్ 30 కింద అత్యాచారం, హత్యాయత్నం, ట్రెస్‌పాస్, కిడ్నాప్ కేసుల్ని నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా బాధితురాలిని వైద్యపరీక్షలకు పంపించిన పోలీసులు.. సంఘటనా స్థలంలో కొన్ని ఆధారాల్ని సేకరించారు. ప్రస్తుతం సీఐ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కాగా.. 2018లో ఓ విషయమై బాధితురాలు టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి ఫిర్యాదు చేయగా, ఆ కేసుని అప్పటి టాస్క్‌ఫోర్స్ సీఐగా నాగేశ్వర్ రావు దర్యాప్తు చేశారు. ఆ తర్వాత బాధితురాలి భర్తను తన ఫాంహౌస్‌లో ఉద్యోగంలో పెట్టుకున్నాడు. 2021 వరకూ అతను పని చేశాడు. ఆ సమయంలోనే ఓసారి బాధితురాలిని వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి, అత్యాచారయత్నం చేశాడు. ఈ విషయం తెలిసి బాధితురాలి భర్త సీఐకి ‘మరోసారి రిపీట్ అయితే నీ భార్యకు చెప్తా’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇంకోసారి చేయనని చెప్పిన సీఐ.. పగతో రగిలిపోయి ఓరోజు కానిస్టేబుల్‌లను వెంటేసుకొని బాధితురాలి ఇంటికెళ్లి, భర్తని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లాడు. అక్కడ అతడ్ని దారుణంగా చితకబాదారు. అంతటితో ఆగకుండా.. గంజాయి ప్యాకెట్లను బాధితురాలి భర్త చేతిలో పెట్టి కేసు నమోదు చేస్తామని బెదిరించాడు.

ఈనెల 6వ తేదిన బాధితురాలికి వాట్సప్ కాల్ చేసి, తన కోరిక తీర్చమని బెదిరించాడు. దీంతో వెంటనే ఫోన్ గ్రామంలోనే పెట్టేసి.. బాధితురాలు, ఆమె భర్త హైదరాబాద్‌కి వచ్చారు. విషయం తెలుసుకొని నేరుగా బాధితురాలి ఇంటికి సీఐ వెళ్లాడు. ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో భర్త రావడంతో ఇద్దరి మధ్య గొడవ నెలకొంది. సీఐ వెంటనే తన దగ్గరున్న తుపాకీతో బెదిరించడం, ఇద్దరిని కారులో ఎక్కించుకొని ఇబ్రహీంపట్నం వైపుకు వెళ్తున్నప్పుడు రోడ్డు ప్రమాదం సంభవించడం, బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. సీఐం తతంగం బట్టబయలైంది.