Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో దారుణం జరిగింది. అప్పటి వరకు ఆహ్లాదంగా జరిగిన కుటుంబ కార్యక్రమంతో హత్య జరిగింది. ఫంక్షన్‌లో డ్యాన్స్ చేయనీకుండా, మ్యూజిక్ ఆపేసినందుకు ఒక వ్యక్తి తన అన్నని గొడ్డలితో నరికి చంపాడని పోలీసులు ఆదివారం తెలిపారు. కోఠి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మౌహార్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. హత్యకు పాల్పడిన నిందితుడు రాజ్ కుమార్ కోల్(30)ని పోలీసులు అరెస్ట్ చేశారు.
రాజ్ కుమార్ సోదరుడు రాకేష్(35) తన ఇంట్లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సమయంలో సౌండ్ సిస్టమ్‌లో మ్యూజిక్ ఆఫ్ చేయడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోపంతో రాజ్ కుమార్, రాకేష్‌పై గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రగాయాలైన రాకేష్ అక్కడికక్కడే మరణించాడు. నిందితుడు ఘటన తర్వాత అక్కడ నుంచి పారిపోయి ఓ కల్వర్టు దాక్కున్నాడని, ఆ తర్వాత తాము పట్టుకున్నామని పోలీసులు చెప్పారు. నిందితుడిని, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
