Bihar: బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటిలో ఒక వ్యక్తి మృతదేహం దొరకడం సంచలనంగా మారింది. నర్హత్ గ్రామంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతూ కుమార్ ఇంట్లో 24 ఏళ్ల యువకుడి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని కాంగ్రెస్ ఎమ్మెల్యే బంధువు పీయూష్ సింగ్ గా గుర్తించారు. డెడ్ బాడీ దొరికిన సమయంలో ఎమ్మెల్యే నీతూ కుమార్ ఇంట్లో లేరని తెలిపారు.
Read Also: Pooja Kolluri : మా మార్టిన్ లూథర్ కింగ్ చూసి మీ అభిప్రాయం తెలియజేయండి..
శనివారం సాయంత్రం ఎమ్మెల్యే ఇంటి వద్ద డెడ్ బాడీ గురించి సమాచారం అందిందని, ఆ తర్వాత దర్యాప్తు కోసం ఒక టీములు పంపామని నవాడ ఎస్పీ అంబరీష్ రాహుల్ తెలిపారు. నీతూ కుమార్ ప్రస్తుతం పాట్నాలో ఉన్నాడు, ఇంట్లో కుటుంబ సభ్యులెవరూ లేరు. ఎమ్మెల్యే మేనల్లుడు గోలు సింగ్ కు చెందిన గదిలో మృతదేహాన్ని కనుగొన్నట్లు పోలీసులు వెల్లడించారు.
గోలుని కలిసేందుకు తన కుమారుడు బయటకు వెళ్లాడని పీయూష్ తల్లి చెప్పింది. ప్రస్తుతం గోలు పరారీలో ఉన్నాడు. గోలు నీతూ కుమార్ బావమరింది సుమన్ సింగ్ కుమారుడు. ప్రాథమిక దర్యాప్తు తర్వాత గోలు సింగ్ ను పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేయలేదు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ఖచ్చితమైన వివరాలను వెల్లడిస్తామని ఎస్పీ చెప్పారు.