Fraud : హైదరాబాద్ మాదాపూర్‌లో నారాయణ విద్యాసంస్థల మాజీ ఉద్యోగి కొత్త దందాతో చర్చనీయాంశమయ్యాడు. మాదాపూర్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో బిల్డింగ్ కట్టిస్తానంటూ టీ.శ్రీహరి అనే వ్యక్తి దాదాపు 40 మందిని లక్షల్లో మోసం చేసినట్టు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. నారాయణ సంస్థల్లో పనిచేసిన అనుభవాన్ని నమ్మి ఉద్యోగులే శ్రీహరికి డబ్బులు పెట్టుబడి పెట్టారు. బిల్డింగ్‌లో ఫ్లాట్లు కేటాయిస్తానంటూ ఒక్కొక్కరి నుండి లక్షల్లో వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఆ డబ్బుతో శ్రీహరి మరో అపార్ట్మెంట్‌లో ఫ్లాట్లు కొనుగోలు చేశాడు. అయితే విషయం తెలిసిన బాధితులు అతన్ని ప్రశ్నించగా, కొనుగోలు చేసిన ప్లాట్లను వారికే అప్పగించినట్టు సమాచారం.
అయితే, ఆ తర్వాత మళ్లీ శ్రీహరి కొత్త పన్నాగం పన్నాడు. తనే అప్పగించిన ఫ్లాట్లు ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్‌గా చూపుతూ జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టార్జిత డబ్బులతో ఆస్తులు కొనుగోలు చేసి, మళ్లీ అదే వ్యక్తి చేత మోసపోవడం తీవ్ర నిరాశ కలిగించిందని చెబుతున్నారు. బాధితులు చివరికి మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Rajini – Kamal: రజనీకమల్ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. ఎందుకంటే?
