భువనేశ్వర్ లో దారుణం చోటుచేసుకుంది.. కొంతమంది ఆకతాయిలు ఒక ప్రేమ జంటపై అమానుషంగా ప్రవర్తించారు. వారికి బలవంతంగా పెళ్లి చేసి, వీడియోలు తీసి అరాచకం చేశారు. వివరాల్లోకి వెళితే.. నవరంగపూర్ జిల్లాలోని సోనపూర్ గ్రామంలో నివాసముంటున్న అక్కను చూడడానికి ఒక యువతి కొద్దిరోజుల క్రితం వచ్చింది. ఆ గ్రామంలో అదే రోజు కాళీమాత పూజ కారణంగా జాతర జరిగింది. ఆ జాతరకు యువతి హాజరైంది. ఆమెను చూడడానికి ఆమె ప్రియుడు కూడా అక్కడకు రావడంతో వారిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవడానికి పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. అదే సమయానికి అక్కడ కొంతమంది ఆకతాయిలు మదయం సేవిస్తూ ఈ ప్రేమ జంటను చూశారు. అనంతరం వారివద్దకు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ప్రేమ జంట అని తెలియగానే వారిలో ఉన్న మృగం బయటకి వచ్చింది. ఆ ప్రేమ జంటను ఇష్టంవచ్చినట్లు దుర్భాషలాడుతూ.. మీరు నిజంగానే ప్రేమికుల అయితే పెళ్లి చేసుకోండి.. అంటూ వారికి బలవంతంగా పెళ్లి చేసి, దాన్ని మొత్తం వీడియోలు తీశారు.
అనంతరం పెళ్లి తరువాత శోభనం అని చెప్పి ఒక గదిలోకి తీసుకెళ్లి బంధించారు. అక్కడ ప్రియుడిని పక్కకు నెట్టి యువతిని అసభ్యకరంగా మాట్లాడుతూ ఆమెను ఎక్కడ పడితే అక్కడ తాకుతూ ఆమె బట్టలను లాగారు. తనను దయచేసి విడిచిపెట్టాలని ఆ యువతి ఎంత మొరపెట్టుకున్నా వారు వినలేదు. అలాగే బంధించి, ఉంచిన వారిని మరుసటిరోజు ఉదయం విడిచిపెట్టారు. విషయం తెలుసుకున్న యువతి తండ్రి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని యువతిని తీసుకువెళ్లడానికి ప్రయత్నించగా.. ఆ గ్రామ పెద్దలు అడ్డుకున్నారు.. అంతేకాకుండా వారిపై దాడికి తెగబడ్డారు. వారినుంచి ఎలాగోలా తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. తనును వేధించిన వీడియోను ఆకతాయిలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, దాని వలన మా పరువు పోయిందని, తమకు న్యాయం చేయాలనీ ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
