Machilipatnam Robbery Gang: మైనర్లకు లిక్కర్, గంజాయి అలవాటు చేసి వారితో చోరీలు చేయిస్తున్న ముఠా ఆటకట్టించారు కృష్ణాజిల్లా పోలీసులు. దీంతో మచిలీపట్నంలో ఏడాదిగా సాగుతున్న దొంగతనాలకు చెక్ పెట్టారు. భారీగా బంగారం, నగదును సీజ్ చేశారు. ఇక్కడ చూడండి.. గోల్డ్ చైన్లు, చెవి కమ్మలు, ఉంగరాలు, లాకెట్స్ లాంటి వాటితోపాటు వెండి వస్తువులు దొంగతనాలు చేస్తున్నారు. ఇవే కాదు.. మొబైల్ ఫోన్స్, విలువైన చిన్న చిన్న వస్తువులను ఇటీవల దోపిడీ దొంగలు ఎత్తుకు వెళ్తున్నారు. కానీ ఎవరు దోపిడీ చేస్తున్నారనేది మిస్టరీగా మారింది. ఈ దోపిడీ దొంగలను పట్టుకునేందుకు కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీసులు తలలు పట్టుకున్నారు. తీరా ఓ వన్ ఫైన్ మార్నింగ్… చోరీ చేసిన మొబైల్ ఫోన్‌లో సిమ్ కార్డు వేయడంతో దొంగల ఆచూకీ లభించింది. దీంతో ఈ చోరీల వెనుక ఉన్న ఇద్దరు సభ్యుల ముఠాను పట్టుకున్నారు. ఆ తర్వాత వారిని విచారించగా మరో షాకింగ్ నిజం బయటకు వచ్చింది. ఈ ఇద్దరు సభ్యులు ముగ్గురు మైనర్లతో చోరీలు చేయిస్తున్నారని విచారణలో తేలింది.
READ MORE: Hyderabad: పదో తరగతి పరిచయం.. ఇరువురి మధ్య ఆకర్షణ.. అందరికీ తెలియడంతో జంట ఆత్మహత్య..!
మచిలీపట్నం నవీన్ మిట్టల్ కాలనీకి చెందిన వల్లూరు సంతోష్, బందరు మండలం పల్లెపాలెంకు చెందిన కొక్కిలిగడ్డ రాముకు చాలా కాలంగా పరిచయం ఉంది. దీంతో ఇద్దరు కలిసి ఈజీగా డబ్బు సంపాదించటానికి ప్లాన్ చేశారు. బందరు ప్రాంతానికి చెందిన ముగ్గురు మైనర్లను గుర్తించి చేరదీశారు. వారికి మాయమాటలు చెప్పి మద్యం, గంజాయి అలవాటు చేశారు. వారిని చోరీలకు పాల్పడాలని రంగంలోకి దింపారు. ముగ్గురు మైనర్లతో తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలు చేయించారు. ఏడాదిగా ఈ ఇద్దరు ముఠా మైనర్లతో దొంగతనాలను చేయిస్తోంది. ఇప్పటివరకు పదికి పైగా చోరీలు చేయించినట్టు సమాచారం. ఇటీవల చోరీ చేసిన వాటిలో ఓ మొబైల్ ఉండటంతో అందులో మైనర్లలో ఒకరు సిమ్ కార్డు వేయడంతో పోలీసులకు టెక్నికల్ ఆధారం దొరికింది. దీంతొ మొదట వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వీరి వెనుక ఉన్న సంతోష్, రాము పాత్ర బయటపడింది. నిందితుల నుంచి రూ. 10 లక్షల నగదు, 100 గ్రాములు బంగారు ఆభరణాలతోపాటు సుమారు 700 గ్రాముల వెండి వస్తువులు పోలీసులు సీజ్ చేశారు. మైనర్లకు అడిగినప్పుడల్లా అవసరాలకు డబ్బులు ఇచ్చి వారి దుర్వసనాలకు ఆసరాగా నిలిచి ఈ దొంగతనాలు చేయించినట్టు పోలీసులు గుర్తించారు.
