కేపీహెచ్‌బీ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. సమత డైరీలో ఏముంది?

Suicide

Suicide

కేపీహెచ్‌బీ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు. బెంగాలీ భాషలో సమత రాసిన డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు. భర్త గోపీనాథ్ ప్రేమ తగ్గిందని, పట్టించుకోవడం లేదని డైరీలో సమత ఆవేదన. చిన్నారి స్నిగ్ధను చంపి ఆత్మహత్యకు పాల్పడిన దంపతులు
నగరంలోని కేపీహెచ్‌బీ (KPHB) మూడో ఫేజ్‌లో ఇటీవల సంచలనం సృష్టించిన ఒకే కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది. తమ చిన్నారి కుమార్తె స్నిగ్ధను హత్య చేసి, ఆపై గోపీనాథ్, సమత దంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన వెనుక ఉన్న మిస్టరీ వీడుతోంది.

బెంగాలీ డైరీతో వెలుగులోకి నిజాలు:

ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టిన కేపీహెచ్‌బీ పోలీసులకు మృతురాలు సమత తన మాతృభాష అయిన బెంగాలీలో రాసిన ఒక డైరీ లభించింది. అందులోని అంశాలను పరిశీలించిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. తనపై భర్త గోపీనాథ్‌కు ప్రేమ తగ్గిపోయిందని, తనను ఏమాత్రం పట్టించుకోవడం లేదని సమత ఆ డైరీలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు గుర్తించారు. దంపతుల మధ్య నెలకొన్న తీవ్ర మనస్పర్థలు, మానసిక సంఘర్షణలే ఈ దారుణానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

ఇప్పటివరకు జరిగిన పరిణామాలు ఇవీ..

కేపీహెచ్‌బీ ఫేజ్-3లో నివాసముంటున్న గోపీనాథ్, సమత దంపతులు తమ చిన్నారి కుమార్తె స్నిగ్ధను హత్య చేసి తాము కూడా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఘటనా స్థలంలో అప్పట్లో గోపీనాథ్ రాసిన ఒక లేఖ లభ్యమైంది. అందులో “స్నిగ్ధ, సమత వెళ్లిపోయారు.. నేను కూడా వెళ్తున్నా” అని గోపీనాథ్ పేర్కొనడం కేసులో కీలక ఆధారంగా మారింది. అంటే, ముందుగా సమత తన కుమార్తెను చంపి ఆత్మహత్య చేసుకోగా, ఆ తర్వాత గోపీనాథ్ కూడా ప్రాణాలు తీసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం గోపీనాథ్ సోదరులకు అప్పగించారు. లోయర్ ట్యాంక్‌బండ్ సమీపంలోని స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించగా, పశ్చిమ బెంగాల్‌లో ఉన్న సమత కుటుంబ సభ్యులు వీడియో కాల్ ద్వారా కడసారి చూపు చూసుకున్నారు. ఘటనా స్థలం నుండి ఎఫ్‌ఎస్‌ఎల్ (FSL) నమూనాలను సేకరించిన పోలీసులు, తాజాగా లభించిన బెంగాలీ డైరీ ఆధారంగా దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.