Site icon NTV Telugu

Hyderabad kidnapping: బాబోయ్ బూచోళ్లు.. కొండాపూర్‌లో చిన్నారి కిడ్నాప్‌కు యత్నం

Hyderabad Kidnapping

Hyderabad Kidnapping

Hyderabad kidnapping: హైదరాబాద్‌లో చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు తిరుగుతున్నాయి. మొన్నటికి మొన్న చందానగర్‍‌‌లో ఓ బాలున్ని ముఠా సభ్యులు ఎత్తుకెళ్లారు. ఆ ఘటన మరువక ముందే కొండాపూర్‌లో మరో చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ఓ మహిళ ప్రయత్నించింది. కానీ అలర్ట్ అయిన స్థానికులు ఆమెను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. యస్.. మీరు విన్నది కరెక్టే. హైదరాబాద్‌లో చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే బూచోళ్లు తిరుగుతున్నారు. దీంతో తల్లిదండ్రుల ఒడిలో హాయిగా ఆడుకోవాల్సిన పిల్లలు.. కిడ్నాపర్ల చేతికి చిక్కి అంగట్లో సరకులా మారుతున్నారు.

READ ALSO: AP Murder: యూట్యూబ్‌లో క్రైమ్ వీడియోలు, ఇంటర్నెట్‌లో హత్య సన్నివేశాలు చూసి.. ఫ్రెండ్ మర్డర్‌కు మాస్టర్ ప్లాన్!

కొద్ది రోజుల క్రితం చందానగర్‌లో ఓ బాలున్ని కిడ్నాప్ చేసిన గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో గ్యాంగ్ బయల్దేరింది. హైదరాబాద్ కొండాపూర్‌లో ఓ చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించింది. దీంతో వెంటనే అలర్టయిన స్థానికులు గ్యాంగ్‌లోని ముగ్గురు సభ్యులను పట్టుకున్నారు. కానీ అందులో ఇద్దరు ఆటోలో తప్పించుకున్నారు. ఓ మహిళ మాత్రం స్థానికుల చేతికి చిక్కింది. దీంతో ఆమెను స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత ఆమెను గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు… ఇటీవలే హైదరాబాద్ చందానగర్‌లో చిన్నపిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా భరతం పట్టారు పోలీసులు. గత ఐదేళ్లుగా నగరంలో పిల్లల కిడ్నాప్‌లకు పాల్పడుతున్న ముఠాకు చెక్ పెట్టారు. ఆగస్టు 26న చందానగర్ పోలీసులకు అందిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. లింగంపల్లి పోచమ్మగూడెం వద్ద నాలుగేళ్ల బాలుడు కనిపించకుండా పోయాడని తల్లి ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి కేసు ఛేదించారు.

ముఠాకు ప్రధాన సూత్రధారి ఆయుర్వేదిక్ మెడిసిన్ డాక్టర్ చిలుకూరి రాజుగా గుర్తించారు. అతనితో పాటు మహ్మద్ ఆసిఫ్, రిజ్వానా, నర్సింహ్మారెడ్డి కలిసి గ్యాంగ్‌గా ఏర్పడి, రైల్వే స్టేషన్లు, నిర్మానుష్య ప్రదేశాల్లో ఐదేళ్లలోపు చిన్నారులను కిడ్నాప్ చేస్తూ, పిల్లలు లేని దంపతులకు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ ముఠా ఆరుగురు చిన్నారులను కిడ్నాప్ చేసినట్లు నిర్ధారణ అయింది… ఇప్పుడు తాజాగా కొండాపూర్ ప్రాంతంలో పట్టుబడ్డ మహిళకు.. గతంలో పోలీసులు పట్టుకున్న గ్యాంగ్‌కు లింక్ ఏదైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ తరహా కిడ్నాప్ ముఠాలు ఎన్ని ఉన్నాయని ఆరా తీస్తున్నారు..

READ ALSO: Whatsapp Group: దొంగను పట్టించిన వాట్సప్‌ గ్రూప్‌.. వాట్సపా మజాకా..

Exit mobile version