Site icon NTV Telugu

Doctor Stabbed To Death: వైద్యం చేస్తుండగా లేడీ డాక్టర్‌ని పొడిచి చంపిన పేషెంట్..

Kerala Incident

Kerala Incident

Doctor Stabbed To Death: కేరళలో లేడీ డాక్టర్ హత్య రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతోంది. కేరళలోని కొల్లాం జిల్లాలోని కొట్టారక్కర ప్రాంతంలో బుధవారం 23 ఏళ్ల వైద్యురాలిని సస్పెన్షన్ లో ఉన్న పాఠశాల ఉపాధ్యాయుడు కత్తితో పొడిచి చంపాడు. నిందితుడిని సందీప్ గా పోలీసులు గుర్తించారు. కాలి కాయంతో ఆస్పత్రికి వచ్చిన సందీప్ కు డాక్టర్ వందనా దాస్ వైద్యం చేస్తుండగా.. ఒక్కసారి కత్తెరతో దాడి చేశారు.ఉన్మాదిగా ప్రవర్తిస్తూ వందనాదాస్ ని పొడిచిపొడిచి చంపాడు.

తన కుటుంబ సభ్యులతో గొడవ పడి వచ్చిన అతనికి వందనా దాస్ వైద్యం చేస్తుండగా బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. చెస్ట్, మెడపై తీవ్ర గాయాలపాలైన డాక్టర్ ను తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా ప్రాణాలు మాత్రం దక్కలేదు. ఈ ఘటనపై కేరళ హైకోర్టు స్పందించింది. ఘటనపై ప్రత్యేక విచారణ జరుపుతామని తెలిపింది. నిందితుడు సందీప్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేరళ మానవహక్కుల కమిషన్ ఈ ఘటనపై సుమోటోగా విచారణ ప్రారంభించింది, ఏడు రోజుల్లోగా నివేదిక అందించాలని కొల్లాం జిల్లా ఎస్పీని ఆదేశించింది.

Read Also: Harish Rao : రైతుబంధుకు నేటితో ఐదేళ్లు.!

ఈ హత్యపై రాజకీయ దుమారం రేగింది. ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జ్ మాట్లాడుతూ.. బాధితురాలు హౌజ్ సర్జన్ అని, ఆమెకు అనుభవం లేదని, అందుకే భయపడిందని కామెంట్స్ చేసింది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికార కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాయి. డాక్టర్ మృతికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), కేరళ గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ (కేజీఎంఓఏ) వైద్యులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపారు.

డ్రగ్స్, మద్యానికి బానిస అయిన నిందితుడు గాయాలతో ఆస్పత్రికి వచ్చే సమయంలో హింసాత్మకంగా ఉన్నాడని ఆస్పత్రి సిబ్బంది తెలిపింది. డాక్టర్ పై దాడి జరిగిన వెంటనే ఆమె కేకలు వేసిందని, డాక్టర్ తో పాటు అతడిని అదుపులోకి తీసుకోవాలనుకున్న సిబ్బందిపై కూడా దాడి చేశాడని వారు తెలిపారు. వందనా దాస్ మృతికి వ్యతిరేకంగా కొల్లాం జిల్లాలో అత్యవసర చికిత్సను నిలిపివేస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు.

Exit mobile version