Jharkhand: జార్ఖండ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే భూషణ్ బారాపై 14 ఏళ్ల గిరిజన బాలిక అత్యాచారం, దాడి, బెదిరింపుల ఆరోపణలు చేసింది. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని సిమ్డేగా జిల్లాకు చెందిన బాలిక ఆరోపించింది. బాలిక ఫిర్యాదు ఆధారంగా ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. పాఠశాలలో ప్రవేశం కల్పిస్తానని తనకు హామీ ఇచ్చని ఎమ్మెల్యే, రాంచీలోని తన నివాసానికి తీసుకెళ్లారని, అక్కడే తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక ఆరోపించింది. ఈ ఆరోపణల్ని ఎమ్మెల్యే పూర్తిగా ఖండించారు.
2026 మే వరకు సిమ్డేగా లోనే నివసించిన బాలికకు ఎమ్మా బారా, జోసిమా ఖాఖా అనే ఇద్దరు మహిళలు చదువు చెప్పిస్తామని, పాఠశాలలో చేర్పిస్తామని నమ్మించి వారి వెంట తీసుకెళ్లారు. మొదట సిమ్డేగాలోని ఎమ్మెల్యే నివాసానికి ఆ తర్వాత రాంచీలోని అతడి అధికారిక నివాసానికి తీసుకెళ్లినట్లు బాలిక ఆరోపించింది. అక్కడే తనతో బలవంతంగా ఇంటి పనులు చేయించేవారని, పనులు ఆలస్యం చేసినా, సరిగా పనిచేయకపోయినా కొట్టేవారని ఫిర్యాదులో పేర్కొంది.
2026 ఆగస్టు 5న రాంచీలోని ఎమ్మెల్యే నివాసంలో భూషణ్ బారా తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక ఆరోపించింది. తాను ప్రతిఘటించడంతో నోటికి గుడ్డలు కట్టి, మౌనంగా ఉండే వరకు కొట్టారని ఫిర్యాదులో పేర్కొంది. దీని గురించి ఎవరికైనా చెబితే చంపేస్తామని, శరీరాన్ని ముక్కలుగా నరుకుతామని బెదిరించినట్లు బాలిక వెల్లడించింది. దీని తర్వాత తప్పించుకుని తన గ్రామానికి వచ్చినట్లు చెప్పింది.
ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. బీజేపీ నేత అమర్ కుమార్ బౌరీ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం హేమంత్ సోరెన్ వెంటనే జోక్యం చేసుకోవాలని విచారణ జరిపించాలని, ప్రజలకు వాస్తవాలు తెలియపరచాలని డిమాండ్ చేశారు. అయితే, ఇదంతా పూర్తిగా అవాస్తమని ఎమ్మెల్యే భూషన్ బారా ఖండించారు. తనపై రాజకీయ ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేసేందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

