NTV Telugu Site icon

Bhopal: ధూమ్ 2 సినిమా తరహాలో చోరీకి ప్లాన్.. బెడిసికొట్టి చివరికిలా..!

Dhoommovie

Dhoommovie

బాలీవుడ్‌లోని ధూమ్ 2 సినిమా చూసి రియల్‌ లైఫ్‌లో అదే రీతిగా చోరీకి ప్లాన్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు ఓ కేటుగాడు. పాపం.. సినిమా వేరు.. రియల్ వేరు అన్న సంగతి గుర్తించక ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కుట్ర వెనుక కోణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

వినోద్ యాదవ్ అనే వ్యక్తి దొంగతనాలు వృత్తిగా సాగిస్తున్నాడు. చిన్న చిన్న దొంగతనాలు చేసి ఏం బాగుపడతాంలే అనుకున్నాడో ఏమో తెలియదు గానీ.. ఏకంగా కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్న ప్లాన్‌తో ధూమ్ 2 సినిమాలోని హీరో హృతిక్ రోషన్ మాదిరిగా మ్యూజియంలో చోరీ చేసి కోట్లు గడించాలని ప్రణాళిక వేసుకున్నాడు. ఇంకేముంది.. అనుకున్నట్టుగానే భూపాల్‌లోని మ్యూజియంలోకి ఆదివారం టికెట్ తీసుకుని ఎంట్రీ ఇచ్చాడు. మ్యూజియం కలియతిరిగిన తర్వాత రహస్య ప్రాంతంలో దాక్కున్నాడు. సిబ్బంది తాళాలు వేసుకుని వెళ్లిపోయిన తర్వాత.. రెండు గ్యాలరీ గదుల్లోకి చొరబడి విలువైన కళాఖండాలను, బంగారం, వెండి నాణేలు.. ఇలా రూ.15 కోట్లు విలువైన వస్తువులను పెద్ద బ్యాగ్‌లో వేసుకున్నాడు. ఇక సోమవారం మ్యూజియం సెలవు ఉండడంతో ఈ యవ్వారం ఎవరికీ తెలియలేదు. అయితే మంగళవారం ఉదయం 10: 30 గంటలకు సిబ్బంది వచ్చి తలుపు తీసి చూస్తే.. అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. గదులను పరిశీలిస్తుండగా ఒక గదిలో నిందితుడు అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. 23 అడుగుల ఎత్తు నుంచి దూకడంతో కాలుకు గాయమై పడిపోయినట్లుగా గుర్తించారు.

నిందితుడి సంచిలో గుప్తుల కాలం నాటి బంగారు నాణేలు, నగలు, పాత్రలతో పాటు బ్రిటీష్, నవాబుల కాలానికి చెందిన ఇతర వస్తువులు ఉన్నాయి. మొత్తం రూ.15 కోట్ల విలువైన వస్తువులను దొంగిలించినట్లుగా సిబ్బంది గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నాడు. విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. ఇతడొక్కడే ఈ పని చేశాడా? ఇంకెవరైనా సహకరించారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) రియాజ్ ఇక్బాల్ తెలిపారు. గోడ దూకడంలో నిందితుడు విఫలమయ్యాడని.. కాలుకు గాయమైనట్లుగా చెప్పారు. మ్యూజియం నుంచి దాదాపు 50 వేలిముద్రలు సేకరించినట్లు తెలిపారు. మ్యూజియం వెలుపల సహచరుడి అవకాశాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.

రికవరీ చేసిన వస్తువుల్లో ఒక్కొక్కటి 50 నుండి 100 గ్రాముల బరువున్న బంగారు నాణేలు ఉన్నాయి. వాటి విలువ రూ. 8 నుంచి 10 కోట్ల వరకు ఉంటుందని అంచనా. రికవరీ చేసిన వస్తువుల మొత్తం విలువ సుమారు రూ. 15 కోట్లు ఉంటుందని డీసీపీ తెలిపారు. ఈ వస్తువులు మ్యూజియంలోని కేవలం రెండు గదుల నుంచి తీసుకున్నట్లు చెప్పారు. మొత్తం మ్యూజియంలో రూ. 50 కోట్ల కంటే ఎక్కువ విలువైన కళాఖండాలు ఉన్నాయని ఆయన చెప్పారు.

ఈ సంఘటన స్టేట్ మ్యూజియంలో భద్రతా ఏర్పాట్లపై తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తింది. ఇందులో అలారం వ్యవస్థ లేకపోవడం, చాలా చోట్ల సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుంది. అంతేకాకుండా మ్యూజియం యొక్క తలుపులు అల్యూమినియంతో తయారు చేయబడి ఉండడంతో బలహీనంగా ఉన్నట్లుగా గుర్తించారు. పైకప్పు భాగాలు కూడా సులభంగా విరిగిపోయే ప్లాస్టిక్ షీట్లతో కప్పబడి ఉన్నాయి. ఇక దొంగతనాన్ని అరికట్టడంలో సెక్యూరిటీ గార్డులు కూడా విఫలమయ్యారు. తాను చాలాసార్లు తప్పించుకునే ప్రయత్నం చేశానని, అయితే గార్డులు నిరంతరం పెట్రోలింగ్ చేయడం వల్ల వెనక్కి తగ్గాల్సి వచ్చిందని నిందితుడు అంగీకరించినట్లు సమాచారం. నిందితుడి నేపథ్యం, మరింత సమాచారం కోసం దర్యాప్తు చేయడానికి బీహార్‌లోని గయాలోని యాదవ్ ఇంటికి పోలీసు బృందం పంపించారు.

Show comments