Moizuddin Murder : రూ.25 లక్షల సుపారీ.. హిట్ అండ్ రన్‌గా న్యాయవాది హత్య స్కెచ్.!

  • న్యాయవాది మొయినుద్దీన్ హత్య కేసులో కీలక మలుపు
  • రాజకీయ నేత, కుమారుడితో పాటు ఆరుగురు అరెస్ట్
  • భూ వివాదాల నేపథ్యంలో రూ.25 లక్షల సుపారీ
  • హిట్ అండ్ రన్‌గా చూపించి పక్కా ప్లాన్‌తో హత్య
Moinuddin Murder

Moinuddin Murder

Moizuddin Murder : హైదరాబాద్ నగరాన్ని తీవ్రంగా కుదిపేసిన ప్రముఖ న్యాయవాది అడ్వకేట్ ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు. చాలా కాలంగా కొనసాగుతున్న వక్ఫ్ ఆస్తుల వివాదాలు, కోర్టు కేసులు , వ్యక్తిగత కక్షల వల్లే ఈ ఘోర హత్య జరిగినట్లు దర్యాప్తులో తేలింది. నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా పక్కా ప్రణాళికతో, కాంట్రాక్ట్ కిల్లింగ్ (సుపారీ) రూపంలో ఈ హత్యాకాండను అమలు చేసినట్లు పోలీసులు అధికారికంగా వెల్లడించారు.

గత మే 23వ తేదీ ఉదయం సుమారు 5:45 గంటల సమయంలో, అడ్వకేట్ ఖాజా మొయిజుద్దీన్ తన రోజువారీ అలవాటు ప్రకారం స్విమ్మింగ్‌కు వెళ్లేందుకు మాసాబ్‌ట్యాంక్‌లోని తన నివాసం నుంచి బయటకు వచ్చారు. ఆయన ఇంటి ముందు పార్క్ చేసిన తన వాహనం వైపు వెళ్తుండగా, ముందే అక్కడ పొంచి ఉన్న నెంబర్ ప్లేట్లు లేని ఒక ఆకుపచ్చ రంగు మహీంద్రా స్కార్పియో వాహనం వేగంగా వచ్చి ఆయనను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు మొయిజుద్దీన్ దాదాపు 10 మీటర్ల దూరం ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం మహావీర్ ఆసుపత్రికి, ఆపై అబిడ్స్‌లోని ఉదయ్ ఓమ్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారు. తొలుత నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ప్రమాద కేసుగా నమోదైన ఈ ఘటన, దర్యాప్తు తర్వాత హత్య కేసుగా రూపాంతరం చెందింది.

×
×
Ad

ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు లభించిన సీసీటీవీ (CCTV) ఫుటేజ్ అత్యంత కీలకంగా మారింది. నిందితుల స్కార్పియో వాహనం ముందుగానే బాధితుడి ఇంటి వద్ద వేచి ఉండి, ఆయన రాగానే టార్గెట్ చేసి ఢీకొట్టిన దృశ్యాలు అందులో స్పష్టంగా రికార్డయ్యాయి. ఘటన అనంతరం నిందితులు పంచవటి లాడ్జ్, సికింద్రాబాద్ , నారాయణగూడలోని మెహ్‌ఫిల్ హోటల్ పరిసరాల గుండా పారిపోయినట్లు సీసీటీవీ ఆధారాల ద్వారా పోలీసులు గుర్తించారు. నిందితులు ఈ హత్య కోసం 2026 జనవరి నెల నుంచే అడ్వకేట్ మొయిజుద్దీన్ ఇల్లు, ఆయన తిరిగే ప్రదేశాలపై నిరంతరం నిఘా ఉంచి, పక్కాగా రెక్కీ నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది.

ప్రధాన నిందితుడు ముజాహిద్ ఆలమ్ ఖాన్ అలియాస్ బాబా కుటుంబానికి, అడ్వకేట్ ఖాజా మొయిజుద్దీన్‌కు మధ్య మలక్‌పేట్, లక్డీకాపూల్ ప్రాంతాల్లోని వక్ఫ్ ఆస్తులకు సంబంధించి పలు సివిల్, క్రిమినల్ , వక్ఫ్ ట్రైబ్యునల్ కేసులు నడుస్తున్నాయి. ఈ కోర్టు కేసుల్లో మొయిజుద్దీన్ చురుకుగా వ్యవహరిస్తూ తమకు వరుస పరాజయాలు ఎదురయ్యేలా చేస్తుండటంతో ముజాహిద్ ఆలమ్ ఖాన్, అతని తండ్రి మహబూబ్ ఆలమ్ ఖాన్ కక్ష పెంచుకున్నారు. ఎలాగైనా ఆయనను అంతమొందించాలని రూ.15 లక్షల భారీ మొత్తాన్ని సుపారీగా నిర్ణయించారు. ఇందులో భాగంగానే తమ సన్నిహితుల ద్వారా సుపారీ కిల్లర్ కిషన్‌ను, అతని ద్వారా వినయ్, స్టంట్ మాస్టర్ అభిజీత్, విక్రమ్ తదితరులను రంగంలోకి దించారు. హత్యకు వాడిన స్కార్పియో కారు కొనుగోలు కోసం ముజాహిద్ ఆలమ్ ఖాన్ రూ.2 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు పోలీసులు కనుగొన్నారు.

సాంకేతిక ఆధారాలు, మొబైల్ లొకేషన్ల సాయంతో పోలీసులు మొదట ప్రధాన నిందితుడైన కిషన్ అలియాస్ పప్పును హర్యానాలోని పానిపట్‌లో మే 27న అరెస్టు చేశారు. అతడిని విచారించగా ఈ నెట్‌వర్క్ మొత్తం బయటపడింది. దాని ఆధారంగా ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ప్రధాన కుట్రదారు ముజాహిద్ ఆలమ్ ఖాన్ (A1), అతని తండ్రి మహబూబ్ ఆలమ్ ఖాన్ (A2), కారు నడిపిన అభిజీత్ (A4), ప్లాన్ వేసిన దిఘన్ వినయ్ (A5)తో పాటు విక్రమ్ ఆదిత్య (A8), మనిదీప్ (A10)లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి హత్యకు వాడిన స్కార్పియో వాహనంతో పాటు రూ.10.10 లక్షల నగదు, పలు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అబిడ్స్ ఏసీపీ పి. ప్రవీణ్ కుమార్ పర్యవేక్షణలో నాంపల్లి పోలీసులు ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.