Site icon NTV Telugu

Ganesha Laddu Robbery: లంబోదరా.. లడ్డూ మాయమాయెరా..!!

Ganesha Mandap Laddu

Ganesha Mandap Laddu

Ganesha Laddu Robbery: గణపతి మండపాల నిర్వాహకులకు మరో పెద్ద సమస్య వచ్చి పడింది. వినాయక మండపాల్లో దొంగలు పడుతున్నారు.. అలా అని హుండీలోని డబ్బో.. వినాయకుడి మెడలో ఉన్న నోట్ల దండో.. విలువైన వస్తువులో మాయం కావడం లేదు. వినాయకుడి చేతిలో ఉండాల్సిన లడ్డూ రాత్రికి రాత్రే మాయం అవుతోంది. పవిత్రంగా భావించే గణేష్‌ లడ్డూను కూడా చోరీ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. మండపాల్లోనే నిర్వాహకులు అర్ధరాత్రి వరకు కాపలాగా ఉంటున్నా.. దొరికిన చిన్న గ్యాప్‌లోనే కొట్టేస్తున్నారు కొందరు ఆకతాయిలు. వినాయకుడి లడ్డు దొంగిలించి తింటే.. అదృష్టం వరిస్తుందంటూ ప్రచారం చేసుకుని మరీ చోరీలకు పాల్పడుతున్నారు. కొందరు లక్షల రూపాయలు పెట్టైనా సరే వేలంలో లడ్డూను దక్కించుకోవాలని చూస్తుంటే.. కొందరు మాత్రం అప్పనంగా దొంగిలించి తమ సొంతం చేసుకోవాలని చూస్తున్నారు.

READ ALSO: Balakrishna : బాలకృష్ణకు రజినీకాంత్, అమితాబ్ స్పెషల్ విషెస్

వినాయక చవితి జరిగి మూడు రోజులు కూడా గడవకముందే.. హైదరాబాద్‌లో పలు చోట్ల మండపాల్లో లడ్డూలు చోరీ అయ్యాయి. నిజాంపేటలో రెండు చోట్ల, కీసర పరిధిలో ఓ మండపంలో, వనస్థలిపురం విజయపురి కాలనీలోని ఓ మండపంలో లడ్డూలు చోరీ అయ్యాయి. మండపాల నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు లడ్డు చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్‌ అయ్యాయి…

వినాయకుడి చేతిలో ఉన్న లడ్డూను దోచుకెళ్లి తింటే అదృష్టం వరిస్తుందని ఓ తప్పుడు ప్రచారం కూడా ఉంది. కేవలం ఇందుకోసమే లడ్డూలు దొంగిలించే వాళ్లు కొందరైతే… మండపాల మధ్య ఉన్న పోటీ, వైరంలో భాగంగా తెలిసిన వ్యక్తులే కావాలని లడ్డూ చోరీ చేస్తున్నారు. దీంతో మండపాల నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. అర్ధరాత్రి, తెల్లవారుజాము వరకు మండపంలోనే కాపలా ఉంటున్నా, మండపం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా.. అదును చూసుకుని లడ్డూ దొంగిలిస్తున్నారని వాపోతున్నారు మండపాల నిర్వాహకులు.

10 రోజుల పాటు విశిష్ట పూజలు అందుకునే వినాయక లడ్డూకి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. వేలంలో లడ్డూను సొంతం చేసుకోవాలని.. ఇందుకు లక్షలు ఖర్చు ఐనా పర్వాలేదని కొందరు భావిస్తుంటారు. వినాయకుడి లడ్డూ సొంతమైతే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. మండపాల నిర్వాహకులు కూడా లడ్డూ వేలం ద్వారా వచ్చే డబ్బులపైనే డిపెండ్‌ అయి మండపాలు పెడుతుంటారు. వేలంలో వచ్చిన డబ్బులతోనే మండపం నిర్వహణ ఖర్చులన్నీ చూసుకుంటుంటారు. ఉన్నఫలంగా లడ్డూ మాయం అవుతుంటే… మండపాల నిర్వాహకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.. కొన్ని మండపాల వద్ద ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా… మరికొన్ని మండపాల్లో నిర్వాహకులు షిఫ్ట్‌‌లు వేసుకుని మరీ కాపలా ఉంటున్నారు. నిద్ర వస్తున్నా.. చంపుకుని మరీ కాపలా ఉంటున్నారు. పోలీసులు సైతం మధ్య రాత్రుల్లో మండపాల వైపు రౌండింగ్‌ వేస్తున్నారు. ఐనా కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు…

నిజానికి వినాయక మండపాల్లో లడ్డూ చోరీలు కొత్తేం కాదు. గతేడాది కూడా ఇలాంటి చోరీలే జరిగాయి. ఈ ఏడాది కేవలం 3, 4 రోజుల వ్యవధిలోనే మళ్లీ లడ్డూ చోరీలు షురూ అయ్యాయి. గతంలో జరిగిన చోరీలపై ఫిర్యాదు చేసినా..పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడం.. లడ్డు దొంగతనం జరిగితే కూడా కేసులు పెట్టాలా అని లైట్ తీసుకోవడం వల్లే ఆకతాయిలు మరింత రెచ్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి..

READ ALSO: Drug Racket: పేరుకే సెక్యూరిటీ గార్డులు.. చేసేది మాత్రం గలీజ్ దందా! స్టూడెంట్స్‌ను టార్గెట్ చేసి

Exit mobile version