Site icon NTV Telugu

Farmhouse Party: ఇన్‌స్టాలో పరిచయాలు.. వీకెండ్‌కు చిల్ అవుదాం అనుకున్నారు.. సీన్ కట్ చేస్తే..

Insta Hyd

Insta Hyd

Farmhouse Party: వీకెండ్ వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ఫామ్‌హౌజ్‌లలో పండగ వాతావరణం ఉంటోంది. ఆట, పాటలు, మందు పార్టీలతో యువత హోరెత్తిస్తున్నారు. సందట్లో సడేమియా అంటూ డ్రగ్స్, గంజాయి పార్టీలు సైతం నిర్వహిస్తున్నారు. ఐతే ఇన్నాళ్లూ యువతే ఈ పార్టీలు ఎక్కువగా చేసుకునే వారు. తాజాగా ఆ పార్టీల్లోకి మైనర్లు సైతం దిగుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ప్రకటన చూసి.. మైనర్లు పార్టీకి హాజరయ్యారు. పైగా గంజాయి తాగుతూ పట్టుబడ్డారు. మొయినాబాద్ ఫామ్‌హౌజ్ కేసులో పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి.

వారంతా మైనర్లు… ఇన్‌స్టాలో పరిచయమయ్యారు. వీకెండ్‌కు చిల్ అవుదాం అనుకున్నారు. మత్తు పార్టీ చేసుకున్నారు. ఇది మామూలు పార్టీ కాదని.. ఇక్కడకు వస్తే అంతులేని ఆనందాన్ని ఆస్వాదించవచ్చని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చూసి టీనేజర్స్ టెంప్ట్ అయ్యారు. సీన్ కట్ చేస్తే.. అలా పార్టీ జరుగుతుందో లేదో.. ఇలా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో చిల్ అవుదామనుకున్న వాళ్ల పరిస్థితి కాస్తా హాట్ హాట్‌గా మారింది.

Crime News: వీడు అసలు మనిషేనా.. కట్టుకున్న భార్యను ఇటుకలతో కొట్టి చంపిన కసాయి భర్త!

టీనేజర్లు ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్ విరివిగా వాడుతున్నారు. అందులో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ చెడు వైపే యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. సరిగ్గా హైదరాబాద్ లో కొంత మంది టీనేజర్లు ఇలాగే ఆకర్షితులయ్యారు. చేతన్ అనే డీజే ఇన్‌స్టా యాప్‌లో ‘ట్రాప్‌ హౌస్‌.9 ఎంఎం’ పేరుతో ఇచ్చిన ప్రకటనలు చూసి బొక్క బోర్లా పడ్డారు. అక్కడ అద్భుతమైన పార్టీ అరెంజ్ చేస్తున్నట్లు ప్రకటనలో రాసుకొచ్చారు. ఇంకేముంది కొంత మంది టీనేజర్లు చిల్ అవుదామని ప్లాన్ చేసుకున్నారు.

ఓకే.. అంతా ఆల్ సెట్ అయింది. చెప్పిన డేట్ ప్రకారం అక్టోబర్ 4న రాత్రి.. మొయినా బాద్ మంగళారంలోని చెర్రీ ఓక్స్ ఫామ్ హౌజ్‌లో పార్టీ ఏర్పాటు చేశాడు నిర్వాహకుడు ఇషాన్. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగే పార్టీలో పాల్గొనేందుకు ముందుగా పాస్‌లు తీసుకోవాలని నిర్వాహకుడు ఇషాన్ కండీషన్ పెట్టాడు. ఒక్కరికైతే రూ. 1600 జంటగా వస్తే రూ. 2800గా రేట్ నిర్ణయించాడు. చాలా మంది ఈ పార్టీ కోసం టెంప్ట్ అయ్యారు. మొత్తంగా సిటీలో 59 మంది టీనేజర్లు నిర్దేశించిన సమయానికి చెర్రీ ఓక్స్ ఫామ్ హౌజ్‌కు చేరుకున్నారు.

ఇక మొయినాబాద్ ఫామ్‌హౌజ్‌లో పెద్ద ఎత్తున పార్టీ జరుగుతోందన్న సమాచారం మేరకు రాజేంద్ర నగర్ పోలీసులు రంగంలోకి దిగారు. ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. పోలీసులు వచ్చే సమయానికి ఫామ్‌హౌజ్‌లో ధూంధాంగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతా మైనర్లే ఉన్నారు. దాదాపు 50 మంది వరకు అంతా మత్తులో జోగుతున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్‌ పరీక్షలు నిర్వహించారు. వారిలో ఇద్దరు గంజాయి తీసుకున్నట్టుగా నిర్ధారణ అయింది. ఇక ఘటనా స్థలం నుంచి 6 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాటిని మొయినాబాద్‌ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.

Flipkart Sale 2025: ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2 పై రూ. 23 వేల డిస్కౌంట్.. మిస్ చేసుకోకండి

ఫామ్ హౌజ్‌ పార్టీ కేసులో మొత్తం ఆరుగురు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నాడని చెబుతున్నారు. నిందితుల్లో ఫామ్ హౌస్ యజమాని, నిర్వాహకుడు, డీజే ఆపరేటర్లు ఉన్నారు. మైనర్లకు నోటీసులు ఇచ్చి పేరెంట్స్‌ను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించి వేసినట్టు తెలుస్తోంది. ఇక చాలా మంది మైనర్లు తమ తల్లిదండ్రులకు తెలియకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇషాన్ పెట్టిన పేజీని ఫాలో అయి ఉండవచ్చంటున్నారు పోలీసులు. అంతే కాదు చాలా మంది ఇంట్లో టూర్‌కు వెళ్తున్నామని చెప్పి.. ఫామ్ హౌజ్ పార్టీకి వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. పిల్లలు మొబైల్ ఫోన్లో ఏం చూస్తున్నారో.. అసలు ఏం చేస్తున్నారో.. కచ్చితంగా పేరెంట్స్ కేర్ తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో పిల్లలు పెడదారి పట్టే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. సో.. బీ అలర్ట్ పేరెంట్స్. పిల్లలు సరైన మార్గంలో వెళ్లాలంటే కాషియస్‌గా ఉండాల్సిందే.

Exit mobile version