Site icon NTV Telugu

Drugs :పంజాగుట్టలోని కాలేజీలో డ్రగ్స్ కలకలం..

Drugs

Drugs

హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ మహమ్మారి నీడలా వెంటాడుతూనే ఉంది. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా, విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ ముఠాలు తమ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నాయి. తాజాగా పంజాగుట్టలోని ఒక ప్రముఖ కాలేజీలో వెలుగుచూసిన డ్రగ్స్ ఉదంతం నగరవాసులను విస్తుపోయేలా చేస్తోంది. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన కాలేజీ ప్రాంగణమే మత్తు పదార్థాల వినియోగానికి వేదికగా మారడం గమనార్హం.

పంజాగుట్ట పరిధిలోని నాగార్జున సర్కిల్ సమీపంలో ఉన్న ఒక ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు కొందరు అనుమానాస్పదంగా తిరుగుతుండటం పోలీసుల దృష్టికి వచ్చింది. వారి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు, ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఐదుగురు విద్యార్థులు కాలేజీ సెల్లార్‌లోనే డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం రాపిడ్ డ్రగ్ టెస్టింగ్ కిట్‌ల ద్వారా పరీక్షలు నిర్వహించగా, ఐదుగురికీ డ్రగ్ పాజిటివ్‌గా తేలింది. వీరి వద్ద నుంచి 10 గ్రాముల ఖరీదైన ఎండిఎంఏ (MDMA) డ్రగ్‌తో పాటు, నిషేధిత హైడ్రోపోనిక్ గంజాయి , సాధారణ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు అత్యంత షాకింగ్ విషయాలు తెలిశాయి. పట్టుబడ్డ విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నది మరెవరో కాదు, సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులేనని తేలింది. అరెస్ట్ అయిన వారిలో అమెజాన్ (Amazon) కంపెనీలో కీలకమైన మేనేజరియల్ పొజిషన్‌లో ఉన్న మహమ్మద్ అబ్దుల్ నబీ, ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో హెచ్ఆర్ (HR) రిక్రూటర్‌గా పనిచేస్తున్న రూపాని ముకేష్ బాబు, , సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీరామ్ రవితేజ ఉన్నారు. వీరికి కట్టంగూరి మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రధాన పెడ్లర్‌గా వ్యవహరిస్తున్నాడు. వీరంతా పగలు వైట్ కాలర్ ఉద్యోగాలు చేస్తూ, అదనపు ఆదాయం కోసం రాత్రి వేళల్లో విద్యార్థులను మత్తు ఊబిలోకి దించుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

అరెస్ట్ అయిన ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు డ్రగ్స్ సేవించడం లేదు కానీ, కేవలం వ్యాపారం కోసమే వీటిని అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరికి ఈ మత్తు పదార్థాలు గోవా లేదా బెంగళూరు వంటి నగరాల నుంచి అందుతున్నాయా? లేక వీరి వెనుక మరేదైనా అంతర్జాతీయ నెట్‌వర్క్ ఉందా? అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, విద్యార్థుల తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి నోటీసులు జారీ చేశారు. ఖరీదైన కాలేజీల్లో చదువుతున్న తమ పిల్లల అలవాట్లు, వారు స్నేహం చేసే వ్యక్తుల పట్ల తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే వారి భవిష్యత్తు అంధకారంలో పడిపోయే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు.

Vijay: ‘‘తలవంచేది లేదు, ఒంటరిగా గెలుస్తాం’’.. టీవీకే చీఫ్ విజయ్ కీలక వ్యాఖ్యలు..

Exit mobile version