అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..

  • విద్యార్ధిని శ్రేయ ఆత్మహత్య వ్యక్తిగత అవమానాలు, మానసిక వేధింపుల ప్రస్తావన ఫ్యాకల్టీ సభ్యులు అవమానించారని ఆరోపించిన శ్రేయ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న నార్సింగి పోలీసులు
Be Alert

Be Alert

HYD YUVATHI SUICIDE: చిన్న తప్పుకు.. పెద్ద శిక్ష.. అది కూడా తనకు తానే వేసుకుంది. కాలేజీలో జరిగిన అవమానాలు.. కించపరిచే మాటలు.. ఇవన్నీ పంటి కింద బిగబట్టిన యువతి.. ఒక్కసారిగా బరస్ట్ అయింది. మానసిక ఒత్తిడికి తలొగ్గి.. అడుగడుగునా అవమానించేవాళ్లు ఉన్న ఈ ప్రపంచంలో బతకలేనంటూ తన దారి తాను చూసుకుంది. ఇప్పుడా విద్యార్థిని తనకు జరిగిన అవమానాలు వివరిస్తూ రాసిన సూసైడ్ లెటర్ కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ మణికొండలోని వాసవి ఇంజనీరింగ్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఐటీ చదువుతున్న విద్యార్ధిని శ్రేయ ఆత్మహత్యకు పాల్పడిన విషాదం నింపింది. సంఘటనతో కళాశాల విద్యార్ధులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఘటన అనంతరం వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్న లేఖలో కళాశాలలో తనపై జరిగిన వ్యక్తిగత అవమానాలు, మానసిక వేధింపుల గురించి ప్రస్తావించడంతో ఈ ఘటన సంచలనంగా మారింది.

పరీక్ష సమయంలో ఒకసారి మొబైల్‌ ఫోన్‌ తీసుకెళ్లినందుకు తనపై చర్యలు తీసుకున్న విషయాన్ని అంగీకరిస్తూనే.. ఆ తర్వాత ఎలాంటి తప్పు చేయకపోయినా తనను పదేపదే లక్ష్యంగా చేసుకుని కొందరు ఫ్యాకల్టీ సభ్యులు అవమానించారని ఆరోపించింది శ్రేయ. పరీక్షకు వెళ్తున్న సమయంలో.. నీలాంటి వాళ్లు ఎప్పటికీ మారరు అంటూ అవమానకర వాఖ్యలు చేశారని పేర్కొంది. మరో సందర్భంలో కూడా తనను ఉద్దేశించి కించపరిచేలా మాట్లాడారని లేఖలో వెల్లడించింది. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.

డాడీ, మమ్మీ, సుహాస్, దివ్య మేడమ్..నన్ను క్షమించండి. ఇక ఇవన్నీ భరించే శక్తి నాకు లేదు. మొదటిసారి నేను తెలియక మొబైల్ తీసుకెళ్లాను. అందుకే నాపై కేసు బుక్ చేశారు. అది నా తప్పే. కానీ ఇప్పుడు మళ్లీ మొదటి రోజు నుంచే నేను ఏ తప్పూ చేయకపోయినా నన్నే లక్ష్యంగా చేసుకుని వేధించడం ప్రారంభించారు. నా రెండో పరీక్ష రాయడానికి వెళ్తుండగా.. నా పక్కగా వెళ్తున్న ఒక ఫ్యాకల్టీ ఇలా అన్నారు. ‘ఇప్పటికే ఒకసారి బుక్ అయ్యాక కూడా నీకు జీవితం మీద సిగ్గు, శరం లేవా? నీలాంటి వాళ్లు ఎప్పటికీ మారరు..’ఛీ’.. ‘ఛీ’..! నేను ఆమెకు అలాంటి మాటలు అనేంతగా ఏమి చేశానో నాకు అర్థం కావడం లేదు. ఆమె చాలా వ్యక్తిగతంగా నన్ను అవమానించారు. ‘వాళ్లకు నువ్వు దొరుకుతావని అనుకుంటే వేరే అబ్బాయి దొరికాడు పాపం’… అంటూ పరీక్ష పూర్తయ్యాక మరో వ్యక్తి అన్నాడు. అంటే ఇంకొక విద్యార్థి పట్టుబడినందుకు బాధపడుతున్నట్లుగా మాట్లాడారు. నేను రెండోసారి ఎలాంటి తప్పూ చేయకపోయినా ఎందుకు నన్నే టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మొదటి పరీక్ష తర్వాత నా కాలిక్యులేటర్ గురించి అడగడానికి వెళ్లాను. నన్ను చూసిన వెంటనే ఒక సార్ ముఖం తిప్పుకుని చాలా మొరటుగా సమాధానం చెప్పారు. అలా ప్రవర్తించాల్సిన అవసరం ఏముంది? నన్ను ఒక మనిషిలా కూడా చూడటం లేదు. నేను ఈ పరీక్షల కోసం చాలా కష్టపడి చదివాను. మంచి మార్కులు సాధించే సామర్థ్యం కూడా ఉంది. కానీ ఈ వ్యక్తిగత వేధింపుల వల్ల ఇక నేను కొనసాగలేకపోతున్నాను. ఇంకో సార్ నేను రెండో DAA ల్యాబ్ ఎక్స్‌టర్నల్ పరీక్షలో అనుజ అనే అమ్మాయి దగ్గర నుంచి కాపీ కొట్టానని అన్నారు. కానీ ఆమె రోల్ నంబర్ 4. ఆమె ఉదయం పరీక్ష రాసింది. నా రోల్ నంబర్ 53. నేను మధ్యాహ్నం పరీక్ష రాశాను. ఉదయం పరీక్ష రాసిన విద్యార్థిని దగ్గర నుంచి మధ్యాహ్నం పరీక్ష రాసే నేను ఎలా కాపీ కొట్టగలను? ‘మీ ఫ్యాకల్టీ అలా చెప్పారు.’ అనేది ఆయన చెప్పిన సమాధానం.

ఒకటి రెండు నెలలుగా చాలా మంది నుంచి ప్రతికూల మాటలు వింటున్నాను. గత 9, 10 నెలలుగా నా క్లాస్‌మేట్స్ నుంచి కూడా నెగెటివిటీ ఎదుర్కొంటున్నాను. వాళ్లు ఇంకా పరిణతి చెందలేదని భావించి పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఫ్యాకల్టీ కూడా ఇలా వ్యక్తిగతంగా అవమానించడం నేను భరించలేకపోతున్నాను. దయచేసి ఈ విషయం కాలేజీలో ఎవరికీ చెప్పకండి. ఎందుకంటే నేను లేకపోతే బాధపడేవారికంటే సంతోషపడేవారే ఎక్కువమంది ఉంటారు. కేవలం దివ్య మేడమ్‌కు మాత్రమే చెప్పండి. నిజంగా నా గురించి శ్రద్ధ తీసుకున్న ఏకైక వ్యక్తి ఆమె. నేను ఈరోజు పోటీల్లో పాల్గొని గెలుస్తున్నానంటే అది కూడా ఆమె ప్రోత్సాహం వల్లే. నాకు ఉన్న ఒక్క ఆధారం ఆమె మాత్రమే. దివ్య మేడమ్, నేను మంచి కంపెనీలో ఉద్యోగం సాధిస్తానని, నా CGPA పెంచుకుంటానని మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. నన్ను క్షమించండి. నా కన్నా చిన్నవాళ్లు కూడా మంచి స్థితిలో ఉన్నారు. కానీ మిమ్మల్ని మాత్రం ఈ ప్రపంచంలో ఒంటరిగా వదిలి వెళ్తున్నాను. నన్ను క్షమించండి. ఈ వ్యక్తిగత వేధింపులు, అవమానాలు భరించలేకనే నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. సుహాస్, మమ్మీ, డాడీ, దివ్య మేడమ్.. మీ అందరినీ నేను ఎంతో ప్రేమిస్తున్నాను. నన్ను క్షమించండి. ఈ లేఖ చూసిన వారంతా పాపం.. శ్రేయ ఎంత మానసిక వేదన అనుభవించి ఉంటుందోనని కన్నీరు పెట్టుకుంటున్నారు.