Site icon NTV Telugu

పైశాచికత్వం.. ఆస్తులకోసం వివస్త్రను చేసి నిర్బంధం..

ప్రభుత్వ ఉన్నతాధికారి అయిన తన భర్త నుండి తనకు ప్రాణహాని ఉందని, తనను రక్షించాలని ఒక మహిళ వేడుకొంటుంది. ఏసీబీ స్వాధీనం చేసుకున్న ఆస్తులను అతని పేరుపై బదలాయించాలని వేధింపులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే ఒకసారి తనపై హత్యాయత్నం చేశారని… డాక్టర్లు సకాలంలో నాలుగు సర్జరీలు చేయడంతో ప్రాణాపాయం తప్పిందని ఆరోపిస్తోంది. నగర పోలీసు ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని కోరుతుంది. సైదాబాద్ లో మీడియా తో బాధితురాలు బోడ పద్మ వివరాలు వెల్లడించారు.

తన భర్త కొర్ర ధర్మానాయక్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎస్ ఈ గా పనిచేస్తున్నాడు. 2008 లో అతను ఇరిగేషన్ సర్కిల్ అధికారిగా పనిచేస్తున్నప్పుడు ఆదాయాన్ని మించి ఆస్తులు ఉన్నాయని సరస్వతినగర్ లోని తమ ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. పలు ఆస్తులను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుండి తనపై వేధింపులు మొదలయ్యాయని పేర్కొంది. తాను చేస్తున్న బ్యాంక్ ఉద్యోగానికి సైతం రాజీనామా చేయించారని తెలిపారు. అతని వేధింపులు భరించలేక గతంలో సైదాబాద్ పీఎస్ లో ఫిర్యాదు చేశానని తెలిపారు. ఏసీబీ స్వాధీనం చేసుకున్న తన పేరుపై ఉన్న ఆస్తులు అతని పేరుపై బదలాయించాలని తీవ్రంగా వేధింపులు చేశారని తెలిపారు.

ఈ నెల 4న భర్త, అతని తల్లి, సహచరులు బలవంతంగా తనతో యాసిడ్ తాగించారని ఆసుపత్రిలో తనకు 4 సర్జరీలు జరిగాయన్నారు. స్థానిక పోలీసులు కూడా పట్టించుకోలేదన్నారు. ఇంటి నుండి బయటకు వస్తే వారి బండారం బయట పెడతానని నన్ను ఇంట్లో ఒక గదిలో వివస్త్రను చేసి బంధించారని రోదిస్తూ తెలిపింది. ఎలాగోలా ఈరోజు ఆ చెర నుండి బయట పడ్డానన్నారు. ఆస్తులు అన్ని అతని పేరుతో బదలాయిస్తానని కానీ అతను తనను ప్రాణాలతో వదలడని భయం వ్యక్తం చేశారు. నగర పోలీసు ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతుంది.

Exit mobile version