NTV Telugu Site icon

Pune: ప్రియురాలి కోసం? చనిపోయిన 5రోజులకు తిరిగి వచ్చిన వ్యక్తి.. ఇంతకీ దయ్యమా? మనిషా?

Love Suicide

Love Suicide

మహారాష్ట్ర పూణేలోని చర్హోలీ గ్రామంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి చనిపోయిన కొద్ది రోజులకు తిరిగి వచ్చాడు. చనిపోయిన వ్యక్తి ఎలా వచ్చాడు? అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం.. పూణేలోని చర్హోలీ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు పొలంలో మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ మృతదేహం పొలాలు దున్నేందుకు ఉపయోగించే రోటావేటర్‌లో ఇరుక్కుపోయి ఛిద్రమైంది. మొండెం పైనుంచి తల కూడా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దుస్తులను గుర్తించగా మృతదేహం గ్రామానికి చెందిన రైతు సుభాష్ అలియాస్ కెర్బా ఛబాన్ థోర్వేది అని తేలింది. పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు సుభాష్ రోటవేటర్‌పై పడి చనిపోయి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావించారు. తరువాత ఏదో ఒక అడవి జంతువు అతని తలను తీసుకెళ్ళి ఉండవచ్చని అనుకున్నారు. కుటుంబసభ్యులు కూడా అలాగే భావించి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

నాలుగు రోజుల తర్వాత సంతాప సభ..
నాలుగు రోజుల తర్వాత.. గ్రామ సమీపంలోని ఇంద్రాయణి నది ఒడ్డున సుభాష్ సంతాప సభ జరిగింది. ఇందులో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. సుభాష్ చిత్రంతో కూడిన బ్యానర్‌లో ‘మీ మనోహరమైన జ్ఞాపకాల ఎల్లప్పుడూ మాతో ఉంటాయి’ అని రాసి ఉంది. కానీ.. మరుసటి రోజు రాత్రి సుభాష్ బతికే ఉన్నాడని గ్రామంలో వార్త వ్యాపించింది. ఎదురుగా అతడిని చూసి కుటుంబ సభ్యులు దెయ్యం అని అరవడం మొదలుపెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని.. అసలు విషయం తెలుసుకున్నారు. నిజం తెలిసిన గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే.. నిజానికి సుభాష్ చనిపోలేదు. మరి సుభాష్ బతికి ఉంటే పొలంలో శిరచ్ఛేదం అయిన మృతదేహం ఎవరిది? దీంతో పోలీసులు సుభాష్‌ను విచారించగా.. ఎట్టకేలకు కథ మొత్తం బయటికి వచ్చింది.

ప్రియురాలితో పారిపోవడానికి కుట్ర..

58 ఏళ్ల సుభాష్ అలియాస్ కెర్బా ఛబాన్ థోర్వ్ భార్య రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది. భార్య వెళ్లిన తర్వాత సుభాష్ అదే గ్రామానికి చెందిన మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సుభాష్‌కు కుటుంబం ఉండడంతో ఆ మహిళతో పబ్లిక్‌గా ఉండలేకపోయాడు. దీంతో పక్కా ప్లాన్‌ వేశాడు. చనిపోయినట్లు నటించి ప్రియురాలితో ఎక్కడో దూరంగా మరో జీవితం ప్రారంభించాలనేది ప్లాన్. సుభాష్ పొరుగున ఉన్న ధనోర్ గ్రామంలో నివసించే 48 ఏళ్ల రవీంద్ర ఘెనంద్‌తో స్నేహం చేశాడు. ఘెనంద్‌కు సొంత వ్యవసాయ భూమి ఉంది. కానీ.. అతను డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఘెనంద్ కూడా మద్యానికి బానిసయ్యాడు. డిసెంబరు 16న సుభాష్ ఘెనంద్‌కు క్రికెట్ మ్యాచ్ చూపిస్తాననే నెపంతో తన ట్రాక్టర్‌పై సమీపంలోని గ్రామానికి తీసుకెళ్లాడు. తిరిగి రాగానే మద్యం సీసా కొనుక్కుని ఇద్దరూ పొలానికి వచ్చారు.

హత్య ఎలా జరిగింది?
సుభాష్‌కు కొద్ది రోజుల క్రితమే ఈ పొలాన్ని దున్నే పని వచ్చింది. సుభాష్, ఘెనంద్ రాత్రి 9 గంటల వరకు పొలాన్ని దున్నారు. ఆ తర్వాత ఘెనంద్ మద్యం సేవించి పూర్తిగా మత్తులోకి జారుకున్నాడు. ఈ అవకాశం కోసమే సుభాష్ ఎదురు చూస్తున్నాడు. అతను గడ్డి కోసే కొడవలితో ఘెనంద్ తల నరికాడు. హత్యానంతరం, అతను తన బట్టలు మృతదేహంపై ఉంచి, తెగిన తలను ఘెనంద్ బట్టలు, కొడవలితో పాటు పొడి బావిలో విసిరాడు. ఇప్పుడు సుభాష్ ఘెనంద్ శరీరాన్ని రోటావేటర్‌తో ఛిద్రం చేశాడు. అతడిని హత్య చేసిన అనంతరం రాత్రి చీకట్లో సుభాష్ బట్టలు లేకుండా వెళ్లిపోయాడు. దారిలో కొందరి వద్ద శాలువాలు అడిగి వాటిని కప్పుకున్నాడు. నేరుగా ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. వారిద్దరూ జెజూరి ప్రాంతానికి పారిపోయారు. మూడు రోజులు అక్కడే ఉన్నారు. సుభాష్ తన ప్రియురాలికి స్నేహితుడి హత్య గురించి చెప్పాడు.

చెల్లి ఎదురుగా చూసి దెయ్యం..

అతని మాటలు విన్న ప్రియురాలు భయపడి ఇంటికి వెళ్లాలని పట్టుబట్టింది. ఇక సుభాష్‌కి ఎలాంటి ఆప్షన్ లేకుండా పోయింది. రాత్రి, అతను తన ప్రియురాలిని ఆమె ఇంటి వద్ద దించి, షెల్ పింపాల్‌గావ్‌లోని తన బంధువును చేరుకోవడానికి దాదాపు 20 కిలోమీటర్లు నడిచాడు. ఒకరోజు ముందు ఆయన సంతాప సభకు హాజరైన సోదరి అతడిని చూసి భయపడి దెయ్యం అనుకుని అరవడం మొదలుపెట్టింది. అనంతరం గ్రామానికి ఫోన్ చేసి సుభాష్ బతికే ఉన్నాడని తెలియజేసింది. ఈ వార్త దావానంలా గ్రామం అంతా వ్యాపించడంతో కొద్దిసేపటికే పోలీసుల చెవికి కూడా చేరింది. పోలీసులు గ్రామానికి చేరుకోగానే సుభాష్ స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి స్పృహలోకి రాగానే తన నేరాన్ని అంగీకరించి కథంతా వివరించాడు. ఈ కేసులో పోలీసులు సుభాష్‌పై హత్య కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ఈ ఘటన
17 డిసెంబర్ 2022న చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.