Insurance Money: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యభర్తలు దారుణంగా ఒక వ్యక్తి హత్యకు పాల్పడ్డారు. వ్యాపారంలో నష్టాలను అధిగమించేందుకు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ వ్యాపారవేత్త తనలాగే కనిపించే వ్యక్తిని హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరించాడు. చివరకు కుట్ర బయపటడటంతో అరెస్టయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలోని అరసికెరే తాలుకాలోని గండాసి పోలీస్ స్టేషణ్ పరిధిలో చోటు చేసుకుంది.
ఆగస్టు 13న గండాసికి సమీపంలోని గొల్లరహోసల్లి గేటుకు సమీపంలో ఒక వ్యక్తి మృతదేహం లభించింది. ఘటనాస్థలంలో కారు, లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతదేహాన్ని పరిశీలించగా హోస్కోటేకి చెందిన మునిస్వామి గౌడ ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లభించింది. దీంతో మునిస్వామి గౌడ భార్యకి సమాచారం అందించారు. భార్య కూడా గౌడ మరణాన్ని ధ్రువీకరించింది. ఘటన తర్వాత చిక్కకోలిగ గ్రామంలో మునిస్వామి గౌడ అంత్యక్రియలు జరిగాయి.
అయితే, నిజానికి మునిస్వామి గౌడ తనలాగే ఉన్న వ్యక్తితో పరిచయం పెంచుకుని ఈ దారుణహత్యకు పాల్పడి అజ్ఞాతంలోకి వెళ్లాడు. హోస్‌కోట్‌లో టైర్ల దుకాణం ఉన్న మునిస్వామిగౌడ్‌కు భారీగా అప్పులు ఉన్నాయి, వాటిని తీర్చేందుకు కోట్లలో ఇన్సూరెన్స్ సొమ్మును క్లెయిమ్ చేసేందుకు పథకం వేశాడు. తనలాగే ఉండే వ్యక్తిని గుర్తించి అతడితో భార్యభర్తలిద్దరూ స్నేహం చేశారు. అతడిని చంపేసి ప్రమాదంగా చిత్రీకరించి ప్లాన్ చేసినట్లు ఎస్పీ మహ్మద్ సుజీత చెప్పారు. దీని కోసం ఓ లారీ డ్రైవర్‌తో బేరం కుదుర్చుకున్నాడు.
Read Also: PAK vs BAN : పాకిస్థాన్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్.. చూస్తే పడిపడి నవ్వుతారు..
ప్లాన్ ప్రకారం, ఆగస్టు 12న మునిస్వామి, తనలాగే ఉన్న వ్యక్తితో కలిసి సిడ్లఘట్ట సందర్శించేందు వెళ్లాడు. అదే సమయంలో కార్ టైర్ పంక్చర్ అయినట్లు మునిస్వామి కారుని రోడ్డు పక్కన ఆపేసి, లారీ డ్రైవర్‌కి సైగ చేశాడు. లారీ దగ్గరకు రాగానే బాధితుడి గొంతుకు తాడు బిగించి, లారీ కింద పడేలా చేసి హత్య చేశాడు. దీంతో అక్కడకక్కడే బాధితుడు మరణించాడు. అయితే, బాధితుడి మెడపై గాయాలకు సంబంధించిన గుర్తులు ఉండటంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో మునిస్వామి భార్యని విచారించిన సమయంలో తన భర్త చనిపోయినట్లు నటించింది.
ఇదిలా ఉంటే, చనిపోయిన వ్యక్తిగా నటిస్తున్న మునిస్వామి వారం లోపే ఓ కేసు విషయంలో కోర్టుకు హాజరుకావడం, దీనిని అతని బంధువైన సిడ్లఘట్ట పోలీస్ ఎస్ఐ చూడటంతో అతడి ప్లాన్ మొత్తం తెలిసింది. దీనిపై ప్రశ్నించగా, తానే ఈ హత్య చేసినట్లు వెల్లడించారు. గండాసి పోలీసులకు విషయం చెప్పి, అరెస్ట్ చేయించాడు. అయితే అతని భార్య శిల్పారాణి పారిపోయినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతడి భార్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు మరణించిన వ్యక్తి గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు.