Honey Trap: విలాసవంతమైన జీవితం గడపాలి.. అప్పుల నుంచి త్వరగా బయటపడాలి.. దీనికోసం ఆ దంపతులు ఎంచుకున్న మార్గం వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. సామాజిక మాధ్యమాలను అడ్డం పెట్టుకుని, శృంగారాన్ని ఎరగా వేసి, ఏకంగా వంద మందికి పైగా పురుషులను బురిడీ కొట్టించిన దంపతుల దందా వెలుగులోకి వచ్చింది. లక్షల రూపాయలు వసూలు చేస్తూ సాగుతున్న వీరి ‘బ్లాక్ మెయిల్’ పర్వానికి కరీంనగర్ పోలీసులు చెక్ పెట్టారు.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకటరావు పేటకు చెందిన 31 ఏళ్ల వ్యక్తి కరీంనగర్‌లో స్థిరపడి మార్బుల్ వ్యాపారం, ఇంటీరియర్ డెకరేషన్ చేసేవాడు. మంచిర్యాలకే చెందిన 29 ఏళ్ల మహిళతో అతనికి వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అంతా సజావుగా సాగుతుందనుకున్న సమయంలో, వ్యాపారంలో భారీగా నష్టాలు వచ్చాయి. దీనికి తోడు అప్పు చేసి కొన్న ప్లాటు ఈఎంఐలు కట్టడం భారంగా మారింది. సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఈ భార్యాభర్తలు కలిసి ఒక ప్రమాదకరమైన నేరపూరిత ప్లాన్ వేశారు.
వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాను తమ వేదికగా చేసుకున్నారు. భార్య ఫోటోలను, ఆకర్షణీయమైన పోస్టులను సామాజిక మాధ్యమాల్లో పెట్టి యువకులకు, వ్యాపారులకు వల వేయడం ప్రారంభించారు. ఆమె మాటలకు ముగ్ధులైన పురుషులను కరీంనగర్‌లోని తమ అపార్ట్‌మెంట్‌కు పిలిపించేది. బాధితులతో ఆమె సన్నిహితంగా ఉన్న సమయంలో, భర్త అత్యంత రహస్యంగా ఆ దృశ్యాలను వీడియో తీసేవాడు.
వీడియోలు చేతికి చిక్కగానే అసలు డ్రామా మొదలయ్యేది. “మీ వీడియోలు మా దగ్గర ఉన్నాయి.. చెప్పినంత డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతాం.. మీ కుటుంబ సభ్యులకు పంపిస్తాం” అంటూ భర్త బాధితులను బెదిరించేవాడు. పరువు పోతుందనే భయంతో బాధితులు అడిగినంత ఇచ్చేవారు. ఇలా గత మూడేళ్లలో సుమారు 100 మందికి పైగా పురుషులను ఈ జంట బ్లాక్ మెయిల్ చేసినట్లు సమాచారం.
ఇటీవల కరీంనగర్‌కు చెందిన ఒక లారీ వ్యాపారి వీరి వలలో చిక్కాడు. అతని నుండి ఇప్పటికే ఈ దంపతులు ఏకంగా రూ. 13 లక్షలు వసూలు చేశారు. అయినప్పటికీ వారి దాహం తీరలేదు. మరో రూ. 5 లక్షలు కావాలంటూ సదరు వ్యాపారిని వేధించడం మొదలుపెట్టారు. ఇక భరించలేకపోయిన బాధితుడు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. పక్కా ప్లాన్‌తో ఈ కిలాడీ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న ఫోన్లు, వీడియో సాక్ష్యాలను పరిశీలించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. వీరి దందాతో ఇంకెంత మంది బలైపోయారనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సోషల్ మీడియాలో తెలియని వ్యక్తుల నుండి వచ్చే పరిచయాలు, ఆహ్వానాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి వేధింపులకు గురైతే భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
Iran Crisis: అగ్రరాజ్యం దెబ్బకు ఇరాన్ గజగజ.. ఖమేనీ చూపు దుబాయ్ వైపు!
