Site icon NTV Telugu

Haryana: భార్య చేతిలో మరో భర్త బలి.. యూట్యూబర్ సాయంతో..!

Haryanamurder

Haryanamurder

భార్యాభర్తల మధ్య సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ప్రియుడి మోజులో పడి కట్టుకున్నవాడినే కడతేరుస్తున్నారు. కలకాలం తోడుండాల్సిన వాళ్లే.. అర్థాంతరంగా కాటికి పంపిస్తున్నారు. ఆ మధ్య జరిగిన మీరట్ హత్యా ఘటన మరువక ముందే తాజాగా అలాంటి ఘటనే హర్యానాలో వెలుగులోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: Punjab King-IPL: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. మొదటి జట్టుగా..!

రవీనా (32), ప్రవీణ్ (35) భార్యాభర్తలు. హర్యానాలోని హిసార్ జిల్లా ప్రేమ్‌నగర్‌లో ఉంటున్నారు. అయితే రవీనా.. సురేష్ అనే యూట్యూబర్‌తో కలిసి రీల్స్ చేస్తోంది. దీన్ని భర్త ప్రవీణ్  జీర్ణించుకోలేకపోయాడు. రీల్స్ చేయొద్దంటూ భర్తతో పాటు కుటుంబ సభ్యులు వారించారు. ఆమె ఏ మాత్రం లెక్కచేయలేదు. పెడచెవిన పడేసింది. రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో 34, 000 మంది ఫాలోవర్లు పెరిగారు. ఇలా ఏడాదిన్నరగా రీల్స్ చేస్తూ భర్తను ఏ మాత్రం పట్టించుకోకుండా యూట్యూబర్‌ సురేష్‌తోనే కలిసి తిరుగుతోంది.

ఇది కూడా చదవండి: Trump: వలసదారులకు ట్రంప్ ప్రత్యేక ఆఫర్

అయితే గత నెల మార్చి 25న రవీనా-యూట్యూబర్ సురేష్ ఒక గదిలో అభ్యంతరకర స్థితిలో భర్త ప్రవీణ్‌కు కనిపించారు. ఆ సీన్ చూసి ప్రవీణ్ తట్టుకోలేకపోయాడు. దీంతో రవీనాతో ప్రవీణ్ గొడవకు దిగాడు. అంతే రవీనా-సురేష్ కలిసి ప్రవీణ్ గొంతు కోసి చంపేశారు. అదే రాత్రి తెల్లవారుజామున 2:30 గంటలకు ప్రవీణ్ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి.. ఇంటికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న రోడ్డు డ్రైయిన్‌లో పడేశారు. అయితే ప్రవీణ్ కుటుంబ సభ్యులు.. రవీనాను ఆరా తీయగా.. తనకు తెలియదని నటించింది. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మార్చి 28న ప్రవీణ్ మృతదేహాన్ని కుళ్లిన స్థితిలో కనుగొన్నారు.

ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవీనా ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా బాగోతం బయటపడింది. బైక్‌పై ప్రవీణ్ మృతదేహాన్ని తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. తిరిగి అదే బైక్‌పై రెండు గంటల తర్వాత వచ్చినప్పుడు మాత్రం రవీనా-సురేష్ మాత్రమే బైక్‌పై ఉన్నట్లు కనిపించింది. దీంతో ఇద్దరిని అరెస్ట్ చేయగా.. నేరాన్ని అంగీకరించారు. రవీనా-సురేష్‌ను పోలీసులు జైలుకు పంపించారు. ప్రవీణ్‌కు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. అతడు తాత సుభాష్, మామ సందీప్‌ దగ్గర నివాసం ఉంటున్నాడు.

ఇది కూడా చదవండి: Crime News: రౌడీ షీటర్ హత్య కేసులో ఎనిమిది మంది అరెస్ట్

 

Exit mobile version