Loan Recovery Agents: లోన్ రికవరీ ఏజెంట్లు ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నారు. బ్యాంక్ రుణం చెల్లించకపోవడంతో కుటుంబాన్ని వేధించారు. చివరకు కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని హాపూర్‌లో చోటు చేసుకుంది. సోమవారం 18 ఏళ్ల కుమార్తెతో సహా దంపతులు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. లోక్ రికవరీ ఏజెంట్లు వేధింపులకు గురిచేయడంతోనే వారు ఈ చర్యలకు ఒడిగట్టారని గ్రామస్తులు ఆరోపించారు.
కపూర్‌పూర్ ప్రాంతంలోని సప్నావత్ గ్రామంలో ఈ సంఘటన జరిగిందని, ఈ విషయంలో తమకు ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అప్పు చెల్లించాలంటూ ప్రైవేట్ బ్యాంక్ ఏజెంట్లు నిత్యం కుటుంబాన్ని వేధిస్తున్నారని గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. మరణించిన వారిని సంజీవ్ రాణా (48) తన భార్య ప్రేమవతి (45), కూతురు పాయల్ (18)గా గుర్తించారు. వీరికి మరో ఇద్దరు మైనర్ కుమారులు ఉన్నారు.
కొంతకాలం క్రితం సంజీవ్ రాణా తన పిల్లల చదువు కోసం ఒక ప్రైవేట్ బ్యాంక్ నుంచి సుమారు రూ. 5 లక్షల రుణం తీసుకున్నాడని కపూర్‌పూర్ స్టేషన్ అధికారి అవనీష్ శర్మ తెలిపారు. ఆగస్టు 31 రాత్రి ఐదుగురు రికవరీ ఏజెంట్లు రానా ఇంటికి చేరుకుని వారిని బెదిరించారని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారని గ్రామస్తులు చెప్పారు. చికిత్స పొందుతూ సంజీవ్ రాణా ఆదివారం రాత్రి మరణించగా, అతని భార్య, కుమార్తె సోమవారం మరణించినట్లు పోలీసులు చెప్పారు.