NTV Telugu Site icon

Gurugram: బాలిక ప్రైవేట్ ఫొటోలతో బ్లాక్‌మెయిల్.. రూ.80 లక్షలు అపహరణ

Girlphotos

Girlphotos

ఓ బాలిక ప్రైవేట్ ఫొటోలు కొందరి చేతుల్లోకి వెళ్లాయి. ఇంకేముంది వారికి అస్త్రంగా మారింది. అసభ్యకరమైన ఫొటోలను అడ్డంపెట్టుకుని బెదిరింపులకు గురి చేశారు. దీంతో కంగారు పడిపోయిన బాలిక.. డబ్బు డిమాండ్ చేసినప్పుడల్లా సమర్పించుకుంటూ వచ్చింది. ఇలా దఫదఫాలుగా రూ.80 లక్షలు సమర్పించుకుంది. కుటుంబ సభ్యుల అప్రమత్తత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది.

గురుగ్రామ్‌ స్కూల్‌లో చదువుతున్న బాలిక ఫొటోలను మార్ఫింగ్ చేసి ట్యూషన్ క్లాస్‌లో విద్యార్థి బెదిరింపులకు దిగాడు. అతడితో మరో ఇద్దరు కలిసి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలు పెట్టారు. దీంతో కంగారు పడిపోయిన బాలిక.. అమ్మమ్మ ఖాతా నుంచి రూ.80 లక్షలు బదిలీ చేసింది. ఫిబ్రవరి, 2024 నుంచి ఇలా దఫదఫాలుగా రూ.80లక్షల వరకు పంపించింది.

అయితే ఇటీవల కుటుంబ సభ్యులు.. అకౌంట్‌లో రూ.80లక్షలు మాయం కావడంతో కంగారు పడ్డారు. భూమి అమ్మగా ఆ డబ్బు వచ్చింది. అయితే అమ్మమ్మ నిరక్షరాసులు. దీంతో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మనవరాలు.. డబ్బులు పంపించింది. డబ్బులు మాయం కావడంతో అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. ఢిల్లీలో తండ్రి పనిచేసే ఒక ప్రైవేట్ పాఠశాలలోనే బాలిక చదువుతోంది. బాలికను నిందితులు బ్లాక్ మెయిల్ చేశారని, ఆమె ప్రైవేట్ ఫోటోలను ఆన్‌లైన్‌లో లీక్ చేస్తామని బెదిరించారని తెలిసింది. డబ్బులు మాయం కావడం అమ్మమ్మ మనవరాలితో గొడవ పడడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

అమ్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు.. డిసెంబర్ 21న పోక్సో చట్టం, బీఎన్‌ఎస్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫోన్‌ రికార్డులు, బ్యాంకు లావాదేవీలను పరిశీలించి హయత్‌పూర్‌, మహేంద్రగఢ్‌కు చెందిన ప్రైవేట్‌ కార్మికుడు కుశాల్‌ (22), కాలేజీ విద్యార్థి సుమిత్‌ కటారియా (20), నిరుద్యోగ యువకుడు సుమిత్‌ తన్వర్‌ (20)లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచిన అనంతరం విచారణ నిమిత్తం రిమాండ్‌కు తరలించారు. దోపిడీ చేసిన డబ్బును రికవరీ చేయడం మరియు నేరంతో సంబంధం ఉన్న అదనపు వ్యక్తులను గుర్తించడంపై పోలీసులు దృష్టి సారించారు.