కాంట్రాక్టర్ వేధింపులు తాళలేక.. పిల్లలు సహా దంతపులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఓ ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇటీవల ఖమ్మం నుంచి సరూర్ నగర్‌కి భార్య పిల్లలతో వచ్చిన శశి కుమార్.. కాంట్రాక్ట్ బిల్లులు ఇవ్వాల్సిందిగా కాంట్రాక్టర్‌ని రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నాడు. దాదాపు రూ. 2 కోట్ల వరకు శశికుమార్‌కు బిల్లు రావాల్సి ఉంది. మొదట్లో మొత్తం డబ్బు ఇస్తానని ఒప్పుకున్న కాంట్రాక్టర్ దినేష్ రెడ్డి.. అదిగో, ఇదిగో అంటూ వాయిదా వేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే శశి కుమార్‌కి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి.
నేరుగా రంగంలోకి దిగి అడగాలని నిర్ణయించుకొని.. ఖమ్మం నుంచి దిల్‌సుఖ్ నగర్‌కి తన కుటుంబంతో శశి కుమార్ శుక్రవారం వచ్చాడు. అక్కడ గణేష్ లాడ్జిలో బస చేశారు. కాంట్రాక్టర్ రూ. 2 కోట్లు ఇవ్వడానికి నిరాకరించడం, పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడంతో.. కుటుంబ సమేతంగా చనిపోవాలని అనుకున్నారు. తనతో తెచ్చుకున్న నిద్రమాత్రల్ని బుధవారం ఉదయం లాడ్జిలో భార్య శ్వేత, కుమారులు రఘుకుమార్ – వరుణ్‌లకు ఇచ్చి, తానూ తీసుకున్నాడు. దంపతులిద్దరు 45 మాత్రలు వేసుకోగా, పిల్లలకు రెండు మాత్రలు వేశారు. పిల్లలు వాంతులు చేసుకోవడంతో, వాళ్ళు ప్రాణపాయ స్థితి నుంచి తప్పించుకున్నారు. ఆర్కా ఆసుపత్రిలో దంపతులకు చికిత్స అందుతోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
