ఢిల్లీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక అపార్ట్‌మెంట్ సమీపంలోని మురుగునీటి కాలువను శుభ్రం చేస్తుండగా విషపూరిత వాయువును పీల్చారు నలుగురు పారిశుధ్య కార్మికులు. దీంతో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రి పాలయ్యారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. అశోక్ విహార్ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది, నలుగురు పారిశుధ్య కార్మికులు ఒక అపార్ట్‌మెంట్ సమీపంలోని మురుగునీటి కాలువను శుభ్రం చేస్తుండగా విషపూరిత వాయువును పీల్చారు. విషపూరిత వాయువు పీల్చడంతో.. అకస్మాత్తుగా నలుగురు పారిశుధ్య కార్మికులకు ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడ్డారు. అందులో అరవింద్ (40) చనిపోయాడు. మరో ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 16న రాత్రి 11:36 గంటలకు, హరిహర్ అపార్ట్‌మెంట్స్, అశోక్ విహార్ ఫేజ్-II సమీపంలో మురుగునీటి శుభ్రపరచాలని PCR కాల్ వచ్చింది. అందులో నలుగురు వ్యక్తులు మురుగునీటి కాలువలో పడిపోయారని తెలిపారు. అక్కడికి చేరుకున్న తర్వాత, నలుగురినీ DDU ఆసుపత్రికి తరలించామని చెప్పారు.. , ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ నివాసి అయిన అరవింద్ మరణించినట్లు ప్రకటించారు. మరో ముగ్గురు – సోను, నారాయణ్, నరేష్ అపస్మారక స్థితిలో ఉండడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.
సంఘటనా స్థలాన్ని క్రైమ్ బృందం పరిశీలించింది. బ్రిజ్‌గోపాల్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ మేనేజర్‌ను విచారణ కోసం పిలిపించారు. ఆ ప్రాంతంలో చాలా రోజులుగా మురుగు కాలువలను శుభ్రపరిచే పనులు జరుగుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
