NTV Telugu Site icon

Cyber Crime: ఢిల్లీ రిటైర్డ్ ఇంజనీర్‌ డిజిటల్‌ అరెస్ట్‌.. రూ.10 కోట్లు కొల్లగొట్టిన స్కామర్లు

Digitalarrest

Digitalarrest

దేశంలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ క్రైమ్ పోలీసులు ఎంత పగడ్బందీగా చర్యలు చేపట్టినా నేరస్థులు మరింత రెచ్చిపోతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణమైన సైబర్ క్రైమ్ వెలుగు చూసింది. 70 ఏళ్ల రిటైర్డ్ ఇంజనీర్‌ను ఎనిమిది గంటల పాటు డిజిటల్ అరెస్ట్ చేసి రూ.10.3 కోట్లు కొల్లగొట్టారు. అసలు విషయం తెలిసి బాధితుడు లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయించాడు.

ఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల రిటైర్ట్ ఇంజనీర్‌ని సైబర్ నేరగాళ్లు ఎనిమిది గంటల పాటు డిజిటల్ అరెస్ట్ చేశారు. ముంబై పోలీస్ అధికారులమంటూ సైబర్ నేరగాళ్లు మొబైల్‌కు ఫోన్ చేశారు. మీ పేరు మీద డ్రగ్స్ పార్శిల్ వచ్చిందంటూ బెదిరింపులకు దిగారు. వీడియో కాల్ కోసం స్కైప్‌ని డౌన్‌లోడ్ చేయాలంటూ హడలెత్తించారు. దుండగుల సూచనలు అనుసరించిన వెంటనే.. వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేశారు. అనంతరం ఎనిమిది గంటల పాటు బెదిరింపులతో చెమటలు పట్టించారు. తైవాన్ నుంచి నిషేధిత మందుల పార్శిల్ వచ్చిందని.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామంటూ సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు దిగారు. ఒక గదిలో బంధించి మొబైల్ లేదా ల్యాప్‌టాప్ కెమెరా ముందు కూర్చోవాలని బెదిరించారు. అనంతరం మరొక గ్రూప్ ఫోన్ చేసి సాయం చేస్తామంటూ లైన్‌లోకి వచ్చి రూ.10 కోట్ల 30 లక్షల నగదును వారి ఖాతాల్లో జమ చేసుకున్నారు. నగదు చేరగానే కాల్ కట్ చేశారు. వెంటనే వివిధ ఖాతాల్లోకి నగదును నేరగాళ్లు బదిలీ చేసేసుకున్నారు.

ఇది కూడా చదవండి: Maharashtra: ‘‘బాటేంగే తో కటేంగే’’.. మిత్రపక్షం అజిత్ పవార్‌పై ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు..

అంతా అయిపోయాక బాధితుడు లబోదిబో అంటూ భోరుమన్నాడు. భారీ మోసాన్ని గుర్తించిన బాధితుడు సహాయం కోసం పోలీసులను సంప్రదించాడు. వెంటనే కేసును సైబర్ బృందానికి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు… రూ.60 లక్షల మొత్తాన్ని స్తంభింపజేశారు. మిగిలిన మొత్తాన్ని రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసు అధికారుల సమాచారం ప్రకారం..బాధితుడు ఒక ప్రతిష్టాత్మక కళాశాల పూర్వ విద్యార్థిగా గుర్తించారు. అలాగే అనేక కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో పని చేసిన అనుభవం ఉంది. కొరియర్ పేరుతో సైబర్ నేరగాళ్లు ట్రాప్‌లోకి దింపారని వెల్లడించారు. తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు స్పష్టం చేశారు.

డిజిటల్‌ అరెస్ట్‌ అంటే..
దేశంలో సైబర్‌ నేరాలు పెచ్చుమీరుతున్నాయి. రోజుకో కొత్తరకం మోసాలు వెలుగు చూస్తున్నాయి. డిజిటల్‌ అరెస్ట్‌ ఇలాంటిదే. సైబర్‌ నేరగాళ్లు వీడియో కాల్‌ చేసి.. పోలీసులమనో లేదంటే దర్యాప్తు అధికారులమనో బెదిరిస్తారు. బ్యాంకు ఖాతా, సిమ్‌ కార్డు, ఆధార్‌ కార్డు వంటివి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వినియోగించుకున్నారని హడలెత్తిస్తారు. విచారణ పూర్తయ్యేంతవరకు అక్కడి నుంచి కదలటానికి వీల్లేదని కంట్రోల్‌లో పెట్టుకుంటారు. డబ్బులు చెల్లిస్తే వదిలేస్తామని చెబుతారు. వారి ఖాతాలోకి డబ్బులు జమయ్యాక విడిచిపెడతారు. ఇలా మనిషిని ఎక్కడికీ వెళ్లనీయకుండా.. ఒకరకంగా అరెస్ట్‌ చేసినట్టుగా నిర్బంధించటమే ‘డిజిటల్‌ అరెస్ట్‌’. దర్యాప్తు అధికారులమని తొందర పెట్టటం వల్ల కంగారుపడి, ఏది ఎక్కడికి దారితీస్తోందనే భయంతో జేబులు గుల్ల చేసుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: Rahul Gandhi: రాహుల్ గాంధీ హెలికాప్టర్ టేకాఫ్ ఆలస్యం.. ‘‘కుట్ర’’ అంటున్న కాంగ్రెస్..

Show comments