NTV Telugu Site icon

Delhi: న్యూఇయర్ వేళ హస్తినలో ఘోరం.. భార్య వేధింపులతో కేఫ్ యజమాని ఆత్మహత్య

Cafeownerdies

Cafeownerdies

భూమ్మీద.. భార్యాభర్తల బంధం అపురూపమైనది. అందమైనది. ఎక్కడెక్కడో పుట్టిన అబ్బాయి.. అమ్మాయి.. పెళ్లి అనే బంధంతో ఒక్కటవుతారు. ఆనాటి నుంచి చచ్చేంత వరకూ ఒక్కటిగా జీవిస్తుంటారు. ఇక సంసారం అన్నాక.. కష్టాలు.. ఒడిదుడుకులు ప్రతి కుటుంబంలో ఉంటాయి. అంతమాత్రాన తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే.. కుటుంబ వ్యవస్థే కుప్పకూలిపోతుంది. ఇదంతా ఎందుకంటారా? ఈ మధ్య భార్యల వేధింపులు దేశంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అర్ధాంగి పెట్టే పోరుకు భాగస్వాములు ప్రాణాలు తీసుకుంటున్న సంఘటనలు దేశాన్ని కలవరపెడుతున్నాయి. ఆ మధ్య బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అతుల్ సుభాష్.. 40 పేజీల లేఖ రాసి.. 49 నిమిషాల ఆడియోలో భార్య, అత్తమామల వేధింపులతో చనిపోతున్నట్లు పేర్కొ్న్నాడు. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తాజాగా దేశ రాజధానిలో కూడా ఇదే తరహాలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. కేఫ్ యజమాని ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య, అత్తమామల వేధింపుల కారణంగా చనిపోతున్నట్లు ఆడియోలో పేర్కొన్నాడు. కొత్త సంవత్సరం వేళ ఈ సంఘటన కలకలం రేపుతోంది.

పునీత్ ఖురానా(40), మాణికా జగదీష్ పహ్వా ఇద్దరూ భార్యాభర్తలు. 2016లో వీరి వివాహం జరిగింది. ఎంతో సంతోషంగా.. ఉల్లాసంగా.. సాఫీగా సాగిపోతున్న సంసారంలో ఒక్కసారిగా ఆటుపోట్లు ఎదురయ్యాయి. భాగస్వాములిద్దరూ కలిసి నడుపుతున్న బేకరీ బిజినెస్‌లో ఒడిదుడుకులు ఏర్పడ్డాయి. అంతే కుటుంబంలో నెమ్మది నెమ్మదిగా గొడవలు మొదలయ్యాయి. చివరికి ఒకరు ప్రాణాలు తీసుకునే అంతగా తీవ్రస్థాయికి చేరుకున్నాయి. చివరికి పాత ఏడాది చివరిలో మంగళవారం ఇంట్లో పునీత్ ఖురానా ప్రాణాలు తీసుకున్నాడు. ఢిల్లీలోని మోడల్‌ టౌన్‌ కళ్యాణ్‌ విహార్‌ ప్రాంతంలోని తన గదిలో ఉరివేసుకుని చనిపోయాడు. అయితే బాధితుడి ఫోన్‌లో 59 నిమిషాల వీడియో రికార్డింగ్ బయట పడింది. భార్య, ఆమె సోదరి, అత్తమామల వేధింపుల కారణంగానే చనిపోతున్నట్లుగా ప్రస్తావించాడు.

ఇదిలా ఉంటే పునీత్ ఖురానా, భార్య మాణికా జగదీష్ పహ్వా విడాకులకు అప్లై చేసుకున్నట్లు తెలుస్తోంది. విడాకులు మంజూరై సమయంలో పునీత్ అర్థాంతరంగా ప్రాణాలు తీసుకోవడం బాధిత కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. బాధితుడి తల్లి, సోదరి కన్నీటి పర్యంతం అవుతున్నారు. భార్య తరపున కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగానే పునీత్ చనిపోయినట్లుగా ఆరోపించారు. భార్యతో వ్యాపార విషయంలో వివాదం తలెత్తడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లుగా పేర్కొన్నారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యతో వ్యాపార సంబంధమైన ఆస్తి గొడవలతోనే పునీత్ చనిపోయినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. పునీత్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని.. భార్యను విచారణ కోసం పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్‌లోనే బెంగళూరులో అతుల్, తాజాగా ఢిల్లీలో పునీత్.. ఇలా రెండు సంఘటనలు కూడా భార్యల వేధింపులతోనే జరగడం విచారకరం. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ సంఘటనలు చర్చనీయాంశం అవుతున్నాయి.

Show comments