Site icon NTV Telugu

Drishyam Real Incident: దృశ్యం సినిమా స్ఫూర్తితో.. ప్రియుడితో కలిసి తండ్రిని చంపింది

Daughter Killed Father

Daughter Killed Father

Daughter Killed Her Father With Help Of Mother And Lover: చిన్నప్పటి నుంచి అల్లారముద్దుగా పెంచి, ప్రయోజకురాల్ని చేసిన కన్నతండ్రిని కడతేర్చింది ఓ కూతురు. కేవలం తన ప్రేమకి అడ్డొస్తున్నాడనే నెపంతో.. ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. మరో దారుణం ఏమిటంటే.. ఈ హత్యకు తల్లి కూడా సహకరించింది. ఆపై దృశ్యం సినిమా తరహాలో.. ఇద్దరూ డ్రామా ఆడారు. చివరికి అడ్డంగా దొరికిపోయారు. సభ్యసమాజం తలదించుకొనే ఈ ఘటన కర్ణాటకలోని బెళగావిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

బెళగావిలో నివాసముంటున్న సుధీర్ కాంబళె (57), రోహిణి దంపతులకు స్నేహ అనే కుమార్తె ఉంది. పూణెలో హోటల్ మేనేజ్‌మెంట్ చదువుతున్న సమయంలో ఆమెకు అక్షయ్ విఠకర్ అనే యువకుడు పరిచయమయ్యాడు. కొన్నాళ్లకు అది ప్రేమగా మారింది. అయితే.. కుమార్తె ప్రేమ విషయం తండ్రి సుధీర్‌కి తెలిసింది. దీంతో ఆయన మందలించాడు. అతనికి దూరంగా ఉండమని హెచ్చరించాడు. తండ్రి సీరియస్ వార్నింగ్ ఇవ్వడం చూసి, తన ప్రేమ ఎప్పటికీ సఫలం కాదని స్నేహ భావించింది. దాంతో, ఆయన్ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తల్లి రోహిణికి చెప్పగా.. చెంప ఛెళ్లుమనిపించాల్సింది పోయి, సరేనని ఆమె ప్లాన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పుడు తల్లి, కూతురు, ఆమె ప్రియుడు కలిసి.. సుధీర్ హత్యకు ప్లాన్ చేశారు. ఈనెల 15న అక్షయ్‌ను బెళగావికి రప్పించి, ఓ లాడ్జిలో ఉంచారు.

ప్లాన్ ప్రకారం.. 16న తండ్రి సుధీర్ గాఢ నిద్రలో ఉండగా, 17న తెల్లవారుజామున అక్షయ్‌ను ఇంటికి పిలిపించింది. తల్లీకూతుళ్లు సుధీర్ కాళ్లు, చేతులు పట్టుకోగా.. అక్షయ్ కత్తితో పొడిచి చంపేశాడు. సుధీర్ చనిపోయాడని నిర్ధారించుకున్నాక, అక్షయ్ తిరిగి పూణె వెళ్లిపోయాడు. ఆ తర్వాత తన భర్తని ఎవరో హత్య చేశారంటూ రోహిణి పోలీసులకు సమాచారం అందించింది. అంతకుముందే, పోలీసులు ఏం ప్రశ్నించినా దృశ్యం సినిమాలోలాగే ఒకే సమాధానం ఇవ్వాలని స్కెచ్ వేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు.. తల్లీకూతుళ్లను ప్రశ్నించారు. వాళ్లు ఒకే రకమైన సమాధానాలు ఇవ్వడంతో, పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో వాళ్లు తమదైన శైలిలో విచారించగా.. హత్య చేసింది తామేనని ఒప్పుకున్నారు. అక్షయ్ సహా తల్లికూతుళ్లని అరెస్ట్ చేసి, కటకటాల వెనక్కి పంపించారు.

Exit mobile version