Site icon NTV Telugu

Cyber Gang Busted: ‘కుబేరా’ తరహా మోసం.. అమాయక అడ్డా కూలీలే వాళ్ల టార్గెట్

Kubera

Kubera

Cyber Gang Busted: కుబేరా సినిమా చూసి ప్రేక్షకులు అంతా ఆశ్చర్యపోయారు. నిజంగా బిచ్చగాళ్లతో అకౌంట్లు ఓపెన్ చేయిస్తారా? వారితో పెద్ద పెద్ద ఆర్ధిక లావాదేవీలు చేయిస్తారా? అసలు అలాంటి ముఠాలు కూడా ఉంటాయా? ఇలా ఎన్నెన్నో డౌట్స్ సినిమా చూసిన ప్రేక్షకులకు కలిగాయి. కానీ ఇప్పుడు సమాజంలో సరిగ్గా అలాంటి ఘటనలే వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న నెల్లూరులో కుబేరా తరహా మోసం వెలుగు చూసింది. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ పోలీసులు కూడా అలాంటి ముఠాను పట్టుకున్నారు.

ఉదయం పూట అడ్డా కూలీల దగ్గరికి వెళ్తారు కొంత మంది ముఠా సభ్యులు. వారితో మాటా మాటా కలుపుతారు. నైస్‌గా తమను నమ్మేటట్టు చేసుకుంటారు. మెల్లగా ఆ మాట ఈ మాట చెప్పి.. బ్యాంక్ అకౌంట్ల టాపిక్ తీస్తారు. తమకు బ్యాంకు అకౌంట్లు తెరిచి ఇస్తే డబ్బులు ఇస్తామని చెబుతారు. బ్యాంక్ అకౌంట్లు ఇస్తే మనకెందుకు డబ్బులు వస్తాయని అడ్డా కూలీలు ఎవరైనా భావించినా.. అడ్వాన్స్ చెల్లించి వారి నోళ్లు డబ్బుతో మూసేస్తారు.

Ganja Smuggling: పెద్ద ప్లానింగే.. లగేజీ బ్యాగుల మాటున భారీ ఎత్తున గంజాయి స్మగ్లింగ్

ఇక అడ్డా కూలీలు బ్యాంక్ అకౌంట్ తెరిచి ఇచ్చేందుకు రెడీ కావడంతో వారిని ఆధార్ కార్డు తీసుకొని రావాలని చెప్తారు. ఆధార్ కార్డు తీసుకొని వచ్చిన తర్వాత అడ్డా మీద ఉన్న కూలీలను నేరుగా బ్యాంకు తీసుకెళ్తారు. బ్యాంకులో ఖాతా తెరిపిస్తారు. అంతే కాదు వారి పేరు మీద కొత్త సిమ్ కార్డు తీసుకుని బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేస్తారు. పాస్ బుక్, ఏటీఎం కార్డ్ డెలివరీ కాగానే ఆ ముఠా సభ్యులు వాటిని తీసేసుకుంటారు. ఇక్కడితో అడ్డా కూలీల ఎపిసోడ్ ముగిసిపోతుంది.

ఇక అడ్డా కూలీల బ్యాంక్ అకౌంట్లు అన్నింటినీ కలెక్ట్ చేసుకుని ఆ ముఠా సభ్యులు.. నేరుగా వాటిని కర్ణాటకకు తరలిస్తారు. అది కూడా బస్సులోనే పంపిస్తారు. అక్కడితో ముఠా సభ్యుల పని అయిపోతుంది. ఇక అసలు ఆట కర్ణాటకలో షురూ అవుతుంది. సైబర్ నేరగాళ్లు ఆయా అకౌంట్లతో ఏకంగా కాల్ సెంటర్లు నడిపిస్తున్నారు. వాటి ద్వారా అక్రమ లావాదేవీలు చేస్తున్నారు. ఆ అకౌంట్లను నేరుగా నకిలీ బెట్టింగ్ యాప్‌లకు కనెక్ట్ చేస్తారు. ఆయా బ్యాంక్ అకౌంట్లలో భారీ ఎత్తున డబ్బులు రాగానే వాటిని తీసేసుకుని ఖాతాలు క్లోజ్ చేసేస్తారు.

Shilpa Shetty : ఫారెన్ వెళ్ళాలా.. 60 కోట్లు కట్టండి!

ఇలా అడ్డా కూలీల పేర్ల మీద బ్యాంక్ అకౌంట్లు తెరుస్తున్నారన్న సమాచారంతో సైబరాబాద్ పోలీసులు నిఘా పెట్టారు. దీనిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు, ఎస్ఓటీ సిబ్బంది సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టారు. కొంత మంది నిందితులను పట్టుకున్నారు. వారిలో ఐదుగురిని అరెస్ట్ చేశారు. దొప్పలపూడి నవీన్‌ కుమార్‌, వంకద్రి సందీప్‌ కుమార్‌, చింతలపాటి ప్రుధ్వి రామరాజు, చింతలపాటి పవన్‌ వెంకట నాగ భారద్వాజ్‌, మామిడిశెట్టి రామాంజనేయులు అరెస్టయిన వారిలో ఉన్నారు. వీరు నకిలీ గేమింగ్‌ యాప్‌లను రూపొందించి, ఆకర్షణీయమైన లాభాలు చూపిస్తూ బాధితులను మోసగించేవారని పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో బ్యాంకు ఖాతాలు, సిమ్‌ కార్డులు సైబర్‌ గ్యాంగ్‌కు సరఫరా చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ గ్యాంగ్‌ టెలిగ్రామ్‌, వాట్సాప్‌ గ్రూపుల ద్వారా 120 కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను ఉపయోగించి నకిలీ లావాదేవీలు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా సత్యనారాయణ వర్మ అనే వ్యక్తి ఆధ్వర్యంలో పని చేసేవారని, ‘Dodge book777’ అనే గేమింగ్‌ పోర్టల్‌ ద్వారా డబ్బులు మళ్లించారని వెల్లడించారు పోలీసులు. ప్రస్తుతం గుర్తించిన లావాదేవీల మొత్తం రూ.14 లక్షలుగా ఉంటందన్నారు. అంతే కాదు వాటికి సంబంధిత ఖాతాలను సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఇక నిందితుల వద్ద నుంచి 2 ల్యాప్‌టాప్‌లు, 30 మొబైల్‌ ఫోన్లు, 32 చెక్‌ బుక్స్‌, 23 ఏటీఎం కార్డులు, 48 సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బ్యాంక్ ఖాతాలు తెరిచి ఇవ్వడం మంచిది కాదని సూచించారు. అలాగే ప్రజలు తమ OTPలు, PINలు, బ్యాంక్‌ వివరాలను ఎవరికీ ఇవ్వకూడదని సూచించారు.

Exit mobile version