టెక్నాలజీతోపాటే… సైబర్ నేరగాళ్లూ అప్‌డేట్ అవుతున్నారు. ఎన్నిరకాలుగా చెక్ పెడుతున్నా.. వాటికి పైఎత్తులు వేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. కేవలం 8 నెలల వ్యవధిలో ఏకంగా 606 కోట్ల రూపాయలు లూటీ చేశారు సైబర్ క్రిమినల్స్. రకరకాలుగా ట్రాప్ చేస్తూ 8 నెలల్లో దాదాపు 15 వేల మందిని మోసం చేశారు. బాధితుల్లో అధికంగా టెక్కీలు, వ్యాపారస్తులు, గృహిణులు ఉంటున్నారు. అందరూ చదువుకున్నోళ్లే.. ఐనాసరే అంత ఈజీగా ఎలా ట్రాప్ అవుతున్నారు..? కోట్లకు కోట్లు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లను పట్టుకోలేమా..?
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీతో… టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. రకరకాల ఇన్నోవేషన్స్ మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. కొత్తొక వింత.. పాతొక రోత అన్నట్టు జనాలు కూడా టెక్నాలజీని ఈజీగా అడాప్ట్ చేసుకుంటున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు.. ఇదే ఫ్లో లో సైబర్ నేరగాళ్లు కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. టెక్నాలజీతోపాటు సైబర్ నేరగాళ్లూ అప్‌డేట్ అవుతున్నారు. రకరకాల పేర్లతో జనాలను బురిడీ కొట్టిస్తూ.. కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. కేవలం ఈ 8 నెలల్లోనే ఏకంగా 600 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు.
సైబర్ క్రైమ్ పోలీసుల లెక్కల ప్రకారం… గత 8 నెలల్లో 14 వేల 739 మంది బాధితుల నుంచి 606 కోట్ల రూపాయలు కాజేశారు. ముఖ్యంగా వాట్సప్, టెలిగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను అడ్డాగా చేసుకుని.. వీటి యూజర్స్‌ను టార్గెట్ చేస్తూ మోసం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు… సందర్భానికి అనుగుణంగా ట్రాప్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.
పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యే రోజులు సమీపిస్తే.. పీఎం కిసాన్ నిధుల వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి అంటూ లింక్ పంపుతున్నారు. గత నెల రోజులుగా AI, గూగుల్ జెమినీ ఫొటోల ట్రెండ్ నడుస్తోంది !! మీ ఫొటోను కూడా త్రీడీలో, జెమిని ఏఐ బనానా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండని మెసేజ్ లు పంపుతున్నారు. క్రికెట్ ఆసియా కప్ జరుగుతోంది. క్రికెట్ స్కోర్ వివరాలు, ఇండియా పాక్ మ్యాచ్ టికెట్ల కోసం క్లిక్ చేయండి అంటూ లింకులు పంపుతున్నారు. మీ బ్యాంక్ ఖాతా కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలంటూ కాల్స్ చేసి ట్రాప్ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో… ఇలా ఎప్పటికప్పుడు తమ రూట్ మార్చుకుంటూ.. ట్రెండ్ కి తగ్గట్టుగా మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు.
వాట్సప్ నెంబర్ కి వచ్చే లింకులు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ లో కనిపించే లింకులపై గుడ్డిగా క్లిక్ చేయొద్దని సూచిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ముఖ్యంగా ఓటీపీలు చెప్పడం, బ్యాంక్ ఖాతాల వివరాలు, యూపీఐ ఐడీ డీటెయిల్స్ చెప్పడం వంటివి చేయొద్దని హెచ్చిరిస్తున్నారు. ఇలాంటి చిన్నచిన్న లాజిక్స్ తో ట్రాప్ చేస్తూ… అకౌంట్ లో డబ్బునంతా ఊడ్చేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. మోసపోతున్న వారిలో అధికంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, ప్రైవేట్ ఎంప్లాయిస్ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. వీళ్లంతా చదువుకున్న వాళ్లే ఐనా.. తమకు విషయ పరిజ్ఞానం ఉన్నా.. ఈజీగా బోల్తా కొడుతున్నారు. సైబర్ క్రిమినల్స్ మాటలకు ట్రాప్ అవుతూ… డబ్బులు పోగొట్టుకుని బకరా అవుతున్నారు. పోలీసులమని చెప్పి చేసే చర్యలపై అవగాహన పెంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
