Cows Thieves: కాదేదీ దొంగతనానికి అనర్హం అన్నట్లు రెచ్చిపోతున్నారు దొంగలు. ఇప్పటి వరకు ధనవంతుల ఇండ్లు టార్గెట్ చేసి ఖరీదైన బంగారు ఆభరణాలు, డబ్బు దొంగతనం చేసుకుని వెళ్లేవారు. ఇప్పుడు కొంత మంది దొంగలు రోడ్ల మీద ఉన్న పశువులను కూడా వదలడం లేదు. అర్థరాత్రి వచ్చి వాటిని దర్జాగా ఎత్తుకు వెళ్లిపోతున్నారు. మొన్న హైదరాబాద్ తర్వాత ఆదిలాబాద్.. తాజాగా తిరుపతిలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ఇంతా చేసి వారు దోచుకు వెళ్లేది ఏదైనా ఖరీదైన వస్తువులో ఏమో అనుకుంటే పొరపాటే. రోడ్లపై ఉన్న ఆవులే వారి టార్గెట్. అర్ధరాత్రి రోడ్లపై ఉన్న పశువుల వద్దకు నెమ్మదిగా వెళ్తారు. వాటికి మత్తు ఇంజక్షన్ ఇస్తారు. దాంతో ఆవులు.. మత్తులోకి జారుకుంటాయి. వెంటనే వాటిని నెమ్మదిగా.. అంతకు ముందే రెడీ చేసుకుని తెచ్చుకున్న కారు వద్దకు తీసుకు వెళ్తారు. ఆవును కారులో కుక్కేస్తారు. అక్కడి నుంచి పారిపోతారు. ఇదీ వారి తంతు.
Students Gang War: మరోసారి కన్నెర్ర చేసిన ర్యాగింగ్ భూతం.. కఠిన చర్యలు తప్పవంటున్న పోలీసులు!
తిరుపతి రూరల్ మండలం ఓటేరులో సరిగ్గా ఇలాగే జరిగింది. పశువుల చోరీకి పాల్పడ్డారు కొంత మంది దుండగులు. అర్థరాత్రి వేళ రెండు ఆవులను కారులో ఎత్తుకెళ్లారు. తల్లి ఆవును తీసుకు వెళ్తున్న క్రమంలో వాటి దూడలు కొంత దూరం కారును వెంబడించాయి. చోరీతోపాటు దూడలు వెళ్తున్న దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మరోవైపు ఆవుల యజమాని చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగారు పోలీసులు. రాత్రి సమయంలో పశువులను దొంగలిస్తున్న నలుగురుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పశువులను దొంగిలించి ఇతర ప్రాంతాల్లో తక్కువ ధరకు అమ్ముతున్నట్లుగా గుర్తించారు. దొంగలు హైదరాబాద్, అశ్వరావుపేటకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. దొంగల వద్ద నుంచి ఒక బోలారో వాహనం, ఒక బైక్, మూడు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు.
POCSO Case: ఛీ.. ఛీ.. ప్రియుడితో కన్న కూతురిపైనే అత్యాచారం చేయించిన తల్లి!
మరోవైపు ఆదిలాబాద్ జిల్లా ముథోల్‌లో కూడా సేమ్ సీన్ జరిగింది. కొంత మంది దుండగులు అర్ధరాత్రి కారులో వచ్చి రెండు ఎడ్లు, ఒక ఆవును దొంగిలించారు. ఈ కేసును ఛేదించిన పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆవులకు మత్తు మందు ఇచ్చి అపహరించి కారులో ఎత్తుకుపోతున్నట్లు గుర్తించారు పోలీసులు. గతంలో హైదరాబాద్‌లో ఆవులను కారులో ఎత్తుకెళ్లారు దుండగులు. సికింద్రాబాద్ బండిమేట్ ప్రాంతంలో కొందరు యువకులు రాత్రి సమయల్లో ఖరీదైన కారులో వచ్చారు. నేరుగా ఆవుల వద్దకు వెళ్లి మత్తు మందు ఇచ్చారు. అవి సృహ కోల్పోయిన తర్వాత వాటిని కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. దీనిపై సీసీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుసగా ఇవే ఘటనలు జరగడంతో జనం ఆందోళన చెందుతున్నారు. అర్ధరాత్రి పూట పశువులకు కూడా రక్షణ లేదని చెబుతున్నారు. నిందితులను గుర్తించి.. కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
